Share News

ఇరాన్‌తో పోరుకు సిద్ధం

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:21 AM

ఇరాన్‌తో ముఖాముఖి తలపడేందుకు ఆ దేశ సరిహద్దుల్లోని కుర్దులు సిద్ధమవుతున్నారు. అమెరికా మద్దతిస్తే ఇరాన్‌ బలగాలతో పోరుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర ఇరాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కుర్దిస్థాన్‌ ఫ్రీడం పార్టీ ప్రతినిధి.....

ఇరాన్‌తో పోరుకు సిద్ధం

  • కుర్దిస్థాన్‌ ఫ్రీడమ్‌ పార్టీ ప్రకటన

  • చర్చలే మేలంటున్న ఇరాకీ కుర్దులు

  • మేం ఏ సాయుధ గ్రూపునకూ సాయం చేస్తామని చెప్పలేదు

  • అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌

ఇర్బిల్‌ (ఇరాక్‌), మార్చి 5: ఇరాన్‌తో ముఖాముఖి తలపడేందుకు ఆ దేశ సరిహద్దుల్లోని కుర్దులు సిద్ధమవుతున్నారు. అమెరికా మద్దతిస్తే ఇరాన్‌ బలగాలతో పోరుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర ఇరాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కుర్దిస్థాన్‌ ఫ్రీడం పార్టీ ప్రతినిధి ఖలీల్‌ నాదిర్‌ అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థకు తెలిపారు. తమ సాయుధ బలగాలు ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దుల్లోని సులేమానియా ప్రావిన్స్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్‌ ప్రభుత్వంతో ఆ దేశంలోని కుర్దులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1979 వరకు కొనసాగిన రాజరికం సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ పాలనలోనూ కుర్దులను దారుణంగా అణచివేశారు. వారి గ్రామాలను ఇరాన్‌ సైన్యం ధ్వంసం చేసి కుర్దులకు నిలువనీడ లేకుండా చేసింది. దాంతో వారు ఇరాక్‌, సిరియా తదితర దేశాలకు వలస వెళ్లారు. ఇప్పుడు ఇరాన్‌ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకొనే సమయం వచ్చిందని కుర్దు నాయకులు భావిస్తున్నారు.

చర్చలే మంచిది

ఇరాన్‌ నుంచి ఇరాక్‌లోకి పారిపోయిన కుర్దు ముఠాలు ప్రతీకారంతో రగిలిపోతుండగా, ఇరాక్‌కు చెందిన కుర్దు పార్టీలు ఇరాన్‌తో నేరుగా తలపడేందుకు వెనుకాడుతున్నాయి. పోరాటానికి దిగితే ఇరాన్‌ తమపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడవచ్చని ఇరాకీ కుర్దు పార్టీలైన కుర్దిష్‌ డెమోక్రటిక్‌ పార్టీ (కేడీపీ), పేట్రియాటిక్‌ యూనియన్‌ ఆఫ్‌ కుర్దిస్థాన్‌ (పీయూకే) నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. కేడీపీ అధినేత మసౌద్‌ బర్జానీ, పీయూకే నాయకుడు బాఫెల్‌ తలబానీలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల మాట్లాడారని ఆ పార్టీల ప్రతినిధులు తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో తమకు మద్దతుగా రావాలని ట్రంప్‌ కోరారన్నారు. ఇరాన్‌తో యుద్ధంకంటే చర్చలే మేలని తమ నాయకులు భావిస్తున్నట్లు ఆ ప్రతినిధులు వెల్లడించారు. సరిహద్దులో శాంతి స్థాపనపై ఇరాక్‌, ఇరాన్‌ మధ్య 2023లో కుదిరిన ఒప్పం దం ప్రకారం ఇరాన్‌పై దాడి చేసే ఏ సాయుధ ముఠాఇరాక్‌ భూభాగాన్ని వాడుకోకుండా చూడాల్సిన బాధ్యత ఇరాక్‌పై ఉంది. మరోవైపు ఇరాన్‌పై యుద్ధం చేస్తే సహాయం అందిస్తామని తాము ఏ సాయుధ గ్రూపునకూ హామీ ఇవ్వలేదని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ బుధవారం తెలిపారు.

Updated Date - Mar 06 , 2026 | 04:21 AM