యుద్ధం.. సెప్టెంబరు దాకా!
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:32 AM
పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్‌పై నాలుగు వారాల్లో సైనిక చర్య ముగుస్తుందని అమెరికా తొలుత పేర్కొన్నా..
ఇరాన్‌పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు
ట్రంప్ చెప్పింది నాలుగు వారాలే.. తర్వాత మరింత కాలం కొనసాగవచ్చన్న అమెరికా రక్షణ మంత్రి
వంద రోజులకు అదనంగా నిఘా సిబ్బంది కావాలని పెంటగాన్‌కు అమెరికా సెంట్రల్ కమాండ్ నోట్
అమెరికా, మిత్రదేశాలకు ఇంటర్‌సెప్టర్ క్షిపణుల కొరత
షహీద్ డ్రోన్లను తక్కువ ఖర్చుతో అడ్డుకునేందుకు యాంటీ-డ్రోన్ వ్యవస్థలను సమకూర్చుకునే చర్యలు
మరో ఆరునెలలు యుద్ధం కొనసాగే చాన్స్
ఇరాన్‌పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్, అమెరికా
టెహ్రాన్‌లోని మిలటరీ కాంపౌండ్‌పై 250 బాంబులు
టెల్‌అవీవ్, మెరాన్ రాడార్ బేస్‌లపై ఇరాన్ క్షిపణి దాడి
ట్రంప్ రక్తం చిందాలి: ఇరాన్ మతాధికారి
దుబాయ్/వాషింగ్టన్/టెల్‌అవీవ్, మార్చి 5: పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్‌పై నాలుగు వారాల్లో సైనిక చర్య ముగుస్తుందని అమెరికా తొలుత పేర్కొన్నా.. ఆ దేశ రక్షణ శాఖలో జరుగుతున్న పరిణామాలతో మరో ఆరు నెలల పాటు యుద్ధం కొనసాగుతుందన్న విశ్లేషణ వెలువడుతోంది. ఇరాన్‌లో మరో వంద రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించేందుకు సరిపడే స్థాయిలో అదనంగా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులను కేటాయించాలని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌కు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. పెంటగాన్ అంతర్గత నోట్‌ను ఉటంకిస్తూ ‘పొలిటికో’ వార్తా సంస్థ దీనిపై కథనం ప్రచురించింది. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు, సైనిక చర్యల బాధ్యతలను సెంట్రల్ కమాండ్ చూసుకుంటుంది. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధం కూడా సెంట్రల్ కమాండ్ పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లారిడాలోని తంపాలో ఉన్న తమ ప్రధాన కార్యాలయంలో అదనపు నిఘా అధికారులను నియమించాలని పెంటగాన్‌ను కోరింది. ప్రస్తుత ఆధునిక యుద్ధాల్లో నిఘా సమాచారం అత్యంత కీలకం. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, శత్రుదేశాల సిగ్నళ్లు, రాడార్ సమాచారాన్ని డీకోడ్ చేయడం, శత్రుదేశ సైన్యాలు, ఆయుధాల కదలికలను గుర్తించి అప్రమత్తం చేయడం వంటివన్నీ ఇంటెలిజెన్స్‌లో భాగమే. అలాంటి ఇం టెలిజెన్స్ సిబ్బంది సంఖ్యను పెంచడమంటే.. దీర్ఘకాలిక సైని క చర్యలకు సిద్ధమైనట్టేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

నాలుగు వారాల నుంచి ఆరు నెలలకు..
ఇరాన్‌పై సైనిక చర్య 4 వారాల్లో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత పేర్కొన్నారు. కానీ ఇరాన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వ వేగంగా తగ్గిపోతోందని, ఇది యుద్ధంపై ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. దాన్ని ఖండించిన ట్రంప్.. తమ వద్ద అపరిమితంగా ఆయుధాల నిల్వలు ఉన్నాయని, వాటితో ఎంతకాలమైనా యుద్ధం చేయవచ్చని ప్రకటించారు. కానీ అదే సమయంలో క్షిపణుల ఉత్పత్తి పెంచడం కోసం ఆయుధ కంపెనీలతో ట్రంప్ భేటీకానున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై మీడి యా ప్రశ్నలకు అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ స్పందిస్తూ.. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ప్రస్తుతం చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. ‘‘నాలుగు వారాల్లో ము గియవచ్చు, ఆరు వారాలో, ఎనిమిది వారాలో పట్టవచ్చు. లేదా ఇంకా మరింతకాలం కూడా కొనసాగవచ్చు’’ అని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కనీసం వంద రోజుల ఆపరేషన్‌కు సరిపడా అదనపు నిఘా సిబ్బంది కావాలని సెంట్రల్ కమాండ్ కోరడంతో.. యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందని అమెరికా రక్షణశాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి.
సరైన ప్రణాళిక లేకుండానే యుద్ధానికి..
అమెరికా ప్రస్తుత చర్యలు చూస్తుంటే సరైన ప్రణాళిక లేకుండానే ఇరాన్‌పై యుద్ధానికి దిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. సాధారణంగా యుద్ధం ప్రారంభించే ముందు.. దాడికి దౌత్యపరమైన సమర్థన, పౌరుల తరలింపు, నిఘా ఏర్పాట్లు, అవసరమైన మేర ఆయుధాలు సమకూర్చుకోవడం వంటివి చేపడతారని, కానీ అమెరికా సైనిక చర్యలో ఇవేమీ కనిపించడం లేదని పశ్చిమాసియాలో పనిచేసిన అమెరికా మాజీ దౌత్యవేత్త గెరాల్డ్ ఫెయిర్‌స్టెయిన్ పేర్కొన్నారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి నేపథ్యంలో.. నిఘా అధికారుల పెంపు, వేగంగా ఆయుధాల ఉత్పత్తి వంటి చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
ఇరాన్ షహీద్ డ్రోన్ల ప్రభావం కూడా..
నిజానికి ఇరాన్‌లో ఆపరేషన్‌ను త్వరగా ముగించవచ్చని అమెరికా తొలుత భావించింది. కానీ ఇరాన్ భారీ సంఖ్యలో షహీద్ ఆత్మాహుతి డ్రోన్లను వినియోగిస్తుండటం సమస్యగా మారింది. ఇరాన్ వద్ద వేలకొద్దీ షహీద్ డ్రోన్లు ఉన్నట్టు అంచనా. తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్ల నిఘా నుంచి తప్పించుకుని లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి అమెరికా ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో ఆ డ్రోన్లను ఎదుర్కొనే వ్యవస్థలను మోహరించాలని అమెరికా నిర్ణయించినట్టు ఆ దేశ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అవి సిద్ధమయ్యేందుకు, ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలను పెంచుకోవడానికి సమయం పడుతుందని.. ఈ క్రమంలోనే ఎక్కువ రోజులు యుద్ధానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి.
విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా
అమెరికా, ఇజ్రాయెల్ గురువారం ఇరాన్‌పై భారీ స్థాయి లో దాడులకు దిగాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లో కీలక ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. టెహ్రాన్‌లోని మిలటరీ కాంపౌండ్‌పై 100 ఫైటర్లతో, 250కిపైగా బాంబులు వేశామని.. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్, ఖడ్స్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, బసిజ్ పారామిలటరీ ఫోర్స్, సైబర్ యూనిట్ల ప్రధాన కార్యాలయాలను నేలమట్టం చేశామ ని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటివరకు ఇరాన్‌కు చెంది న 300 క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన వైఏకే-130 యుద్ధ విమానాన్ని తమ ఎఫ్-35 ఫైటర్‌తో కూల్చివేసిన దృశ్యాన్ని ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ గురువారం ఎక్స్‌లో పోస్టు చేసింది. పైలట్ నడుపుతున్న యుద్ధ విమానాన్ని ఇలా నేలకూల్చడం గత 40 ఏళ్ల ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇక ఖమేనీ నివాసంపై దాడి సహా ఇరాన్‌లో తొలి 4 రోజుల్లో చేసిన దాడుల దృశ్యాలతో ’100 హవర్స్ ఆఫ్ ఆపరేషన్ ఫ్యూరీ’ పేరుతో ఒక వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
ప్రతీకారంతో ఇరాన్ దాడులు ఉధృతం
హిందూమహా సముద్రంలో తమ యుద్ధనౌకను అమెరికా పేల్చివేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ ఆఫ్ పర్షియన్, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో అమెరికా నౌకలపై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ తీరానికి వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దుర్మార్గపు దాడి చేసిందని, దీనిపై భవిష్యత్తులో పశ్చాత్తాప పడి తీరుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఇక గురువారం ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు, షహీద్ డ్రోన్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, జెరుసలేం, మెరాన్ రాడార్ బేస్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. అబుధాబిలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్ దాడిలో ఆరుగురికి గాయలయ్యాయి. ఖతార్‌లోని దోహాలో ఒక భవనాన్ని ఇరాన్ క్షిపణి ధ్వంసం చేసింది. తమ దేశంలోని ప్రాంతాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసిందని అజర్‌బైజాన్ పేర్కొనగా.. ఆ దాడులు తాము చేయలేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,230కి పెరిగిం ది. లెబనాన్‌లో 102 మంది, ఇజ్రాయెల్‌లో 12 మంది మరణించారు. ఇరాన్‌దాడుల్లో అమెరికా సైనికులు ఆరుగురు మృతిచెందారు. ఒమన్ తీరానికి సమీపంలో మాల్టా దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ సఫీన్ ప్రెస్టీజ్ వాణిజ్య నౌకపై డ్రోన్‌దాడి జరిగింది. నౌక తీవ్రంగా దెబ్బతిన్నదని, అందులోని 24మంది సిబ్బందిని రక్షించామని ఒమన్ నౌకాదళం వెల్లడించింది. ఇక హోర్ముజ్ జలసంధిలో కువైట్ తీరానికి సమీపంలో చమురు రవాణా నౌకపై దాడి జరిగింది.
దీర్ఘకాల యుద్ధంతో నష్టమే!
ఇరాన్‌తో దీర్ఘకాలిక యుద్ధం జరిగితే అమెరికాకు తీవ్ర నష్టం తప్పదని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాపైనే పూర్తిగా దృష్టిపెడితే అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోతాయని.. పునరుద్ధరించుకోవడానికి చాలా సమయం పడుతుందని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రష్యా, చైనా వంటి దేశాలు దాడిచేస్తే ఎదుర్కొనే సామర్థ్యం లేకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ మా సాయం అడగలేదు: రష్యా
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ తమను మిలటరీ సాయం ఏమీ కోరలేదని రష్యా వెల్లడించింది. ఇరాన్‌కు మాటపరమైన మద్దతేకాకుండా రష్యా మిలటరీ సాయం చేసే అవకాశముందా అని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇరాన్ వైపు నుంచి అలాంటి విజ్ఞప్తి ఏదీ రాలేదు. ఈ విషయంలో మా స్థిరమైన వైఖరి అందరికీ తెలిసిందే. అందులో ఎలాంటి మార్పూ లేదు’’ అని వెల్లడించారు. అయితే గత ఏడాది జనవరిలో ఇరాన్‌తో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో మిలటరీ సాయం అంశమేదీ లేదని రష్యా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ట్రంప్ రక్తం చిందాలి: ఇరాన్ మతాధికారి పిలుపు
ఇరాన్‌పై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ యూదులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్తం చిందాలని.. ఇరాన్ ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని అయతుల్లా (ఉన్నత మతాధికారి) అబ్దొల్లా జవేదీ అమోలి పిలుపునిచ్చారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని ఇరాన్ అధికారిక టీవీ గురువారం ప్రసారం చేసింది. ‘‘ఇప్పుడు మనం ఒక కీలక పరీక్ష అంచున ఉన్నాం. మన ఐక్యతను కాపాడుకోవడంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అణచివేతకు పాల్పడుతున్న అమెరికాతో పోరాడాలి. యూదుల రక్తం చిందాలి. ట్రంప్ రక్తం చిందాలి’’ అని పిలుపునిచ్చారు. ఇరాన్‌లో అంతర్గతంగా తిరుగుబాటు రెచ్చగొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో అయతుల్లా అబ్దొల్లా వీడియో సందేశం ప్రాధాన్యం సంతరించుకుంది.