Share News

ఈ క్షిపణితోనే ఖమేనీపై మెరుపు దాడి!

ABN , Publish Date - Mar 06 , 2026 | 02:59 PM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ బ్లూ స్పారో క్షిపణితో టార్గెట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతరిక్ష నుంచి విరుచుకుపడే క్షిపణిగా బ్లూ స్పారోను ఇజ్రాయెల్ వర్గాలు పిలుస్తాయట.

ఈ క్షిపణితోనే ఖమేనీపై మెరుపు దాడి!
Blue Sparrow missile - Khamenei Assasination

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. ఈ దాడికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక ప్రత్యేక మిసైల్‌తో ఖమేనీని (Khamenei Assasination) ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాయుమండలం అంచుల నుంచి వేగంగా దూసుకొచ్చిన బ్లూ స్పారో (Blue Sparrow Missile) మిసైల్‌ ఖమేనీని అంతం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఏమిటీ బ్లూ స్పారో మిసైల్?

ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ వర్గాలు ‘అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణి’గా అభివర్ణిస్తాయి. ఫైటర్ జెట్స్‌ నుంచి ప్రయోగించే ఈ మిసైల్ మొదట వాయుమండలం అంచుల వరకూ ఎగిరి, తరువాత భూమిపై ఉన్న లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. భీకర వేగంతో అత్యంత కచ్చితత్వంతో టార్గెట్స్‌ను ఛేదించడం ఈ మిసైల్ ప్రత్యేకత. బ్లూ స్పారో రాకను శత్రుదేశాలు గుర్తించి, స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

 THE WEAPON: BLUE SPARROW MISSILE

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ మిసైల్‌తో 2 వేల కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను సులువుగా ధ్వంసం చేయొచ్చు. ఇక ఖమేనీపై దాడి తరువాత మిసైల్‌ విడి భాగాలు ఇరాక్ భూభాగంలో లభించాయి. దీంతో బ్లూ స్పారో ఆ మార్గం మీదుగా ప్రయాణించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుదూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ ఆయుధ సంస్థ తయారు చేసింది.

 THE WEAPON: BLUE SPARROW MISSILE


బ్లూ స్పారో తరహాలోనే ఇజ్రాయెల్ వద్ద బ్లాక్, సిల్వర్ స్పారో క్షిపణులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి వీటిని ఇజ్రాయెల్‌ తొలుత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించేందుకు ఒక ప్రయోగాత్మక మిసైల్‌గా డిజైన్ చేసింది. అయితే, వీటి శక్తి సామర్థ్యాల దృష్ట్యా కాలక్రమంలో ప్రత్యేక క్షిపణులుగా అభివృద్ధి చేసింది. కీలక లక్ష్యాలపై అత్యంత వేగంతో దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ఈ బ్లూ స్పారోను వినియోగిస్తుంది. ఖమేనీపై దాడి సందర్భంగా ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ నుంచి ఇజ్రాయెల్ ప్రయోగించిన బ్లూ స్పారో వాయుమండలం అంచులను తాకిన అనంతరం కళ్లుచెదిరే వేగంతో ఖమేనీ ఉన్న భవనాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరో డజను మంది సీనియర్ అధికారులు కన్నుమూశారు.

Khamenei.jpg


ఈ వార్తలూ చదవండి:

ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

చైనా రక్షణ బడ్జెట్‌ 23.13 లక్షల కోట్లు!

Updated Date - Mar 06 , 2026 | 04:34 PM