Share News

రాష్ట్రానికి ఇనుప ఖనిజం భారీ ఆస్తి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 05 , 2026 | 09:40 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇనుప ఖనిజం భారీ ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఇనుప ఖనిజం ద్వారా ఆదాయంతోపాటు ఉపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రానికి ఇనుప ఖనిజం భారీ ఆస్తి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 05: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇనుప ఖనిజం భారీ ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఇనుప ఖనిజం ద్వారా ఆదాయంతోపాటు ఉపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రాజధాని అమరావతిలో గనుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. తద్వారా 1.52 లక్షల ఉద్యోగాల సృష్టికి మార్గం ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఖనిజ వనరుల సద్వినియోగంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.


రాష్ట్రంలో 1,938 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని వివరించారు. వీటి ద్వారా స్టీల్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్సెలార్ మిట్టల్, జెఎస్‌డబ్ల్యూ భారీ ఉక్కు ప్రాజెక్టులకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. 2035 నాటికి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు. మిగిలిన ఐరన్ ఓర్ బ్లాకుల కేటాయింపునకు ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు.


2030 నాటికి 30 మెట్రిక్ టన్నులు ఉత్పత్తే లక్ష్యమని స్పష్టం చేశారు. 2035 నాటికి 113 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఐరన్ ఓర్ వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ గ్రేడ్ మాగ్నటైట్ ప్రాసెసింగ్‌కు ప్రత్యేక విధానం అమలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


మైనింగ్ లీజుల మంజూరులో వేగం పెంచాలని సూచించారు. 2025-26లో గనుల ఆదాయం లక్ష్యాన్ని మించిందని గుర్తు చేశారు. రూ.3,416 కోట్ల ఆదాయం గనుల శాఖ సాధించిందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి అని తెలిపారు. 2026-27లో గనుల శాఖ ద్వారా రూ.4,650 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మైనింగ్ లీజులు, లైమ్ స్టోన్ ఉత్పత్తి పెంపుతో ఆదాయం పెరుగుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 09:51 PM