హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్
ABN , Publish Date - May 05 , 2026 | 08:20 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 2.0తో పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి దాడులు నిర్వహించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహించి.. 56 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మే 05: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 2.0తో పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి దాడులు నిర్వహించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహించి.. 56 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బ్యాంక్ సిబ్బందితోపాటు పట్టుబడ్డ నిందితులకు 101 కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే అరెస్ట్ అయిన వారిలో 32 మంది బ్యాంక్ మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్‌షిప్ మేనేజర్లతోపాటు ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు.
అదే విధంగా15 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లతో పాటు, 9 మంది అకౌంట్ ఆపరేటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరికీ 101 కేసులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాధితులకు రూ. 69.99 లక్షలు రీఫండ్ చేశారు. ఈ 101 కేసుల్లో బాధితుల నుంచి రూ. 9.13 కోట్ల నగదును నిందితులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇక అరెస్టయిన వారిలో 17 మంది ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌కు సంబంధించిన వారని పోలీసులు వివరించారు. ట్రేడింగ్ ఫ్రాడ్‌లో 30 మంది, డిజిటల్ అరెస్ట్ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇలా అరెస్టయిన వారిలో తెలంగాణ నుండి అత్యధికంగా 17 మంది ఉన్నారని తెలిపారు. మహారాష్ట్ర నుంచి 14, ఢిల్లీ నుంచి 9, కర్ణాటక నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరు అరెస్టయ్యారని పేర్కొన్నారు.
నిందితుల నుంచి 34 మొబైల్ ఫోన్లు, 8 చెక్ బుక్కులతోపాటు 11 షెల్ కంపెనీ స్టాంపులు, ట్యాబ్ సీజ్ చేశామని వివరించారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా అక్రమ బెట్టింగ్, నకిలీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న 184 సోషల్ మీడియా ప్రొఫైళ్లు తొలగించినట్లు పోలీసులు చెప్పారు. సి-మిత్ర ద్వారా1250 కాల్స్ చేసి బాధితులకు అవగాహన కల్పించడంతో పాటు 194 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
గేమింగ్ ఫ్రాడ్ కేసులో బాధితురాలిని మోసం చేసి రూ. 74.99 లక్షలు మోసం చేసిన కేసులో కోల్‌కతాకు చెందిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ కీ అకౌంట్ మేనేజర్ మొహమ్మద్ రియాజుద్దీన్, అసిస్టెంట్ మేనేజర్ మనీష్ ప్రసాద్ విశ్వకర్మను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.