AP High Court: కోర్టుతో ఘర్షణ పడాలని చూస్తున్నారా?: హైకోర్టు సూటి ప్రశ్న
ABN , Publish Date - Jan 05 , 2026 | 08:34 PM
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పార్ట్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని కొనసాగించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను.. 2024 జనవరిలో ధర్మాసనం ముందు అధికారులు అప్పీల్ చేశారు.
అమరావతి, జనవరి 05: విద్యాశాఖలోని ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులంటే విద్యాశాఖ అధికారులకు కనీస మర్యాద లేకుండా పోయిందంటూ కాస్తా ఘాటుగా వ్యాఖ్యానించింది. పవర్ ఫుల్ వ్యక్తుల కింద పనిచేస్తునందున ఎవరు ఏమి చేయలేరనే భావనతో ఉన్నట్లు ఉన్నారని ఉన్నతాధికారుల తీరుపై హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు.. కోర్టుతో ఘర్షణ పడాలని ఆశిస్తున్నారా? అంటూ నిలదీసింది. ఆలోచన అదే అయితే.. ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తదుపరి విచారణ నాటికి కోర్టుకు హాజరు కావాలంటూ ఐఏఎస్ అధికారి బి. శ్రీనివాసరావును ఆదేశించింది. సదరు ఐఏఎస్ అధికారికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కేసును సుమోటోగా తీసుకుంది.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పార్ట్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని కొనసాగించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను 2024 జనవరిలో ధర్మాసనం ముందు అధికారులు అప్పీల్ చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తామని గత విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కోర్టుకు పిటిషనర్ల తరఫు న్యాయవాది గుర్తు చేశారు. దాంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక విజయనగరం అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ చేసిన తప్పునకు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను బాధ్యుడిగా చేయడం సరికాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది రామచంద్రరావు కోర్టులో తన వాదనలు వినిపించారు. ఉన్నతాధికారి ఆదేశాలు ఇవ్వడమే కాదు... వాటిని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు విచారణను నెల రోజులకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు: నాగబాబు
కవిత ఆరోపణలు.. చర్యలు తీసుకోని సీఎం: టీ బీజేపీ చీఫ్
For More AP News And Telugu News