Saras Mela 2026: గుడ్ న్యూస్.. ఇక ఆన్‌లైన్‌లో రుణాలు: సీఎం
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:26 PM
సంజీవని పథకంతో ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఇక ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గుంటూరు, జనవరి 08: డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు నగర శివారులో ఈ రోజు సరస్ మేళా 2026.. అఖిల భారత డ్వాక్రా బజారును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. సొంత కాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా స్థాపించినట్లు తెలిపారు. టీడీపీకి మహిళలతో ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కష్టాలు చూసే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వివరించారు.

సంజీవని పథకంతో ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చామని వివరించారు. ఇక ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పొదుపు సంఘాలు రూ. 26వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాయని తెలిపారు. 1.13 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. పొదుపు సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పారు. తన మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు. అధిక తలసరి ఆదాయం పొందేది మన తెలుగువారి కుటుంబాలేనని స్పష్టం చేశారు.
దేశంలోని బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఇక్కడికి తీసుకురావాలన్నారు. మహిళల శక్తి తనకు తెలుసునని చెప్పారు. మన రాష్ట్రంలోని మహిళలు.. ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు ఉచితంగా బస్సులో తిరిగే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని వివరించారు. ఈ సందర్భంగా స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధానిపై మళ్లీ కుట్రకు తెర తీసిన జగన్
సీఎం రేవంత్‌తో హిమాచల్ ప్రదేశ్ మంత్రి భేటీ.. విద్యా విధానంపై ఆరా..
For More AP News And Telugu News