Jagan Comments On Amaravati: రాజధానిపై మళ్లీ కుట్రకు తెర తీసిన జగన్
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:32 PM
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విషం కక్కారు. ఏపీ రాజధాని విజయవాడ , గుంటూరు మధ్య నిర్మించాల్సిందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతి, జనవరి 08: రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ కుట్రలకు తెర తీశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు పెడుతున్న సమయంలో వైఎస్ జగన్ కుయుక్తులకు పాల్పడుతున్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఫ్యాన్ పార్టీ అధినేత విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా నదీగర్భంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నారని జగన్ ఆరోపించారు. దీనిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని అనే పదమే లేదని.. సీఎం ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అంటు ఆయన పునరుద్ఘాటించారు. నదీ గర్భంలో భవన నిర్మాణాలకి అనుమతులివ్వరని.. అలాంటింది రాజధాని నిర్మాణం చేపడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. రహదారులు, నీరు, విద్యుత్ సరఫరా లేని ప్రాంతంలో రాజధాని నిర్మాణం అంటూ వైఎస్ జగన్ వ్యంగ్యంగా అన్నారు. సో కాల్డ్ క్యాపిటల్ అంటూ అమరావతిని ఆయన అభివర్ణించారు.
అమరావతి రాజధానిగా ఉండడం వల్ల తమకేమీ అభ్యంతరం లేదని ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా వైఎస్ జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిపై మళ్లీ మాట మారస్తూ వైఎస్ జగన్ నాలిక మడతేస్తున్నారంటూ విమర్శలు ఊపందుకున్నాయి.
2014లో తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయింది. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. రాజధాని ఏర్పాటు కోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పరిశీలించి.. చివరకు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో తూళ్లురుతోపాటు 28 గ్రామాల పరిధిలో రాజధాని అమరావతి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీలో స్వాగతిస్తూ ప్రకటన చేశారు.
రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతలో మళ్లీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటరు వైసీపీకి పట్టం కట్టాడు. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటూ.. అందుకు ఏపీకి మూడు రాజధానులు ఉండాలంటూ వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఆ క్రమంలో శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కర్నూలు, పరిపాలన రాజధాని విశాఖపట్నం అంటూ వివరణ ఇచ్చారు.
దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. తమ విన్నపాలు వినాలంటూ వారు చేసుకున్న విజ్ఞప్తిని సీఎంగా వైఎస్ జగన్ పెడచెవిన పెట్టారు. దాంతో రైతులు నాటి నుంచి ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు. అంతేకాకుండా.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అలాగే అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేసేందుకు రైతులకు అనుమతి నిరాకరించారు. దాంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. ఈ పాదయాత్రలకు అనుమతి లభించింది.
అయినా.. అడుగడుగునా పోలీసుల నిఘా కారణంగా.. రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మూడు రాజధానుల ప్రాంతంలో ఒక్క ఇటుక వేసి.. నిర్మాణాన్ని సైతం ఈ ప్రభుత్వం చేపట్టలేదు. అలాగే ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమంగా కేసులు పెట్టి.. జైలుకు తరలించారు. దాంతో జగన్ పాలనపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి.
ఈ ఎన్నికల ఫలితాల్లో కూటమికి 164 సీట్లు వచ్చాయి. వైసీపీకి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కక పోవడం గమనార్హం. 2024లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దాంతో ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. అలాంటి వేళ.. విజయవాడ, గుంటూరు మధ్య ఏపీ రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా, నిమిషానికో మాట మారుస్తున్న జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
జనగణన తొలిదశకు రంగం సిద్ధం.. కేంద్రం నోటిఫికేషన్ జారీ
For More AP News And Telugu News