Share News

మరికాసేపట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోద ముద్ర

ABN , Publish Date - Jun 23 , 2026 | 10:33 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మరికాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.

మరికాసేపట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోద ముద్ర

అమరావతి, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మరికాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో దాదాపు 80కిపైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ ఈ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి అంశాలను ఆమోదించనుంది. అలాగే ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ క్యాబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనుంది.


పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. దాదాపు 34వేల కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35 వేల ఉద్యోగాల కల్పన అవకాశాలకు సంబంధించిన నిర్ణయాలకు ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపనుంది. ఉండవల్లి ప్రాంతంలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులను ఓకే చేయనుంది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీని రూ.130 కోట్ల వ్యయంతో నిర్మించనుంది. అందుకు సంబంధించిన పనులను అప్పగించే అంశాలపై ఈ కేబినెట్‌లో చర్చించనుంది.


అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనాలకు ఈ కేబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నం , తిరుపతి, కర్నూలు, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు ఈ భేటీలో అంగీకారం తెలపనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు సైతం ఈ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది.


కేబినెట్ భేటీలో పాల్గొని మంత్రులు..

మంగళవారం జరిగే కేబినెట్ సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరుకావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్ఎండీ ఫరూఖ్ మక్కా యాత్రలో ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ కూడా ఈ భేటీకి రావడం లేదు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కార్యక్రమంలో సత్యకుమార్ యాదవ్ పాల్గొనున్నారు. దీంతో ముందస్తు అనుమతితో ఆయన ఈ కేబినెట్‌ సమావేశానికి హాజరుకావడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంజే బంగారం షాపు దోపిడీ.. మరో ఇద్దరు దొంగలు అరెస్ట్

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

For More AP News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 10:49 AM