పెద్ద రాష్ట్రాల్లో యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీకి బెస్ట్ ర్యాంక్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 09 , 2026 | 05:20 PM
ఏపీలో రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ ఇచ్చిన తాజా నివేదిక అద్దం పడుతోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
అమరావతి, నవంబర్ 09: రాష్ట్రంలో రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ ఇచ్చిన తాజా నివేదిక అద్దం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నివేదికలో ఏపీ రెండో స్థానంలో నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. సామాజిక, ఆర్థిక భద్రతలో రాష్ట్రానికి 0.69 స్కోరు వచ్చిందని వివరించారు. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, న్యాయ సేవల ఆధారంగా ఈ ర్యాంకులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
కేరళ, తమిళనాడు, తెలంగాణ, సిక్కిం తదితర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగైన ర్యాంకు సాధించిందని ఏపీ సీఎం తెలిపారు. రాష్ట్ర ఆదాయం స్థాయితో పోలిస్తే అంచనాలకు మించి 0.15 పాయింట్ల స్కోర్ సాధించిందని అన్నారు. ఆదాయానికి, అవకాశాల కల్పనకు మధ్య దేశంలోనే అత్యధిక సానుకూల వ్యత్యాసం ఏపీలో నమోదయిందని వివరించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, గృహ వసతి, వైద్యం, విద్య, ఉపాధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు.
బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, న్యాయ సేవల అందుబాటులోనూ ఏపీ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి పాలన, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని వివరించారు. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ అగ్రస్థానానికి కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికలో..
సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సీఎన్ఈఎస్ (CNES) రూపొందించిన యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 0.66 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది.
ఈ నివేదికలో.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లోనే ఏపీ అత్యధిక ర్యాంకు సాధించింది. తలసరి ఆదాయంలో 13వ స్థానం.. అవకాశాల కల్పనలో 2వ స్థానంలో ఏపీ నిలిచింది. ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటుకుంది. 0.68 స్కోరుతో గోవా అగ్రస్థానాన్ని ఆక్రమించిందని స్పష్టం చేసింది. 23 విభాగాల్లోని 60 సూచికల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. యువకుడి అరెస్ట్
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
Read Latest AP News And Telugu News