గుంటూరు పట్టాభిపురం రైతు బజార్‌కు మహర్దశ: కేంద్ర మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - May 15 , 2026 | 12:04 PM
జిల్లాలోని రైతులకు, సామాన్య వినియోగదారులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు, మే 15 : జిల్లాలోని రైతులకు, సామాన్య వినియోగదారులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటైన పట్టాభిపురం రైతు బజార్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 6 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన G+2 భవన నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..‘గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ భవన నిర్మాణం ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. 9 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశిస్తున్నాం. రైతులకు, వినియోగదారులకు మేలు చేయడమే లక్ష్యం’ అని అన్నారు.
ఇదిలా ఉంటే.. సుమారు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవనం, అటు రైతులకు, ఇటు కొనుగోలుదారులకు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను అందించనుంది. ఈ భవనంలో మొత్తం 100 షాపులను ఏర్పాటు చేయనుండగా, అందులో 60 షాపులను నేరుగా రైతులకు, మరో 30 షాపులను డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేకంగా కేటాయించారు. వినియోగదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్స్, అత్యున్నత స్థాయి హైజీన్ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మిర్చి యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News