గుంతకల్లు-వాడి రైల్వే మార్గం.. నాలుగు లైన్లుగా..
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:13 AM
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.
గుంతకల్లు-వాడి లైన్ క్వాడ్రాప్లింగ్
గుంతకల్లు-బళ్లారి సెక్షన్‌లోనూ...
అంచనాలు రూపొందిస్తున్న అధికారులు
పట్టాలెక్కనున్న భారీ ప్రాజెక్టులు
గుంతకల్లు(అనంతపురం): గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను క్వాడ్రాప్లింగ్ (నాలుగు లైన్లుగా) చేయడానికి రంగం సిద్ధమౌతోంది. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ముంబై-చెన్నై రైల్వే లైన్‌లో రైళ్లను వేగవంతంగా నడపడానికి అదనపు సమాంతర లైన్లను నిర్మించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం డబుల్ లైన్‌గా ఉన్న ఈ రూటులో ఒకేసారి అదనంగా మరో రెండు లైన్లను నిర్మించడానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు అంచనా వ్యయాలను రైల్వే ఇంజనీరింగ్ శాఖ తయారు చేస్తోంది.
ఐదేళ్ల ప్రణాళికతో రైల్వే డివిజన్‌లోని వాడి, బళ్లారి లైన్లతోపాటు ఇతర చోట్ల కూడా మరికొన్ని ప్రధాన రైలు మార్గాలను నాలుగు లైన్లుగా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్‌ను అనుసరించి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పీజీ) ఆధ్వర్యంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(Karnataka, Telangana, Andhra Pradesh, Tamil Nadu) రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ రైల్వే రూట్లను నాలుగు లైన్లుగా మార్చి మల్టీమోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్ సామర్ధ్యాన్ని పెంచడానికి పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. వేల కోట్లతో తయారయ్యే అంచనాలకు ఆర్థిక వనరుల కోసం రైల్వే బోర్డుకు, నీతి ఆయోగ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖల పరిశీలనకు పంపనున్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్టులో ఈ బృహత్ పథకాలకు గ్రీన్ సిగ్నల్ లభించి, ప్రాథమిక నిధుల కేటాయింపు జరిగే అవకాశాలు ఉన్నాయి.

రూ. 5 వేల కోట్లతో వాడి సెక్షన్
పీఎం గతిశక్తి ఆధ్వర్యంలో గత నెలలో ఎన్‌పీజీ సమావేశమై దేశంలో ఏడు ప్రధాన రైలు మార్గాలను నాలుగు లైన్లుగా మార్చడానికి ప్రాథమిక ఆమోదాన్ని తెలిపింది. రైళ్ల వేగాలను పెంచి ప్రయాణ సమయాలను తగ్గించడం, సరుకు రవాణా సదుపాయాలను పెంచడం లక్ష్యంగా ఈ రైల్వే ట్రాక్ క్వాడ్రప్లింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ మేరకు గుంతకల్లు-వాడి సెక్షన్‌లో 230 కి.మీ.ల డబుల్ లైన్‌ను నాలుగు లైన్లుగా మార్చడానికి దాదాపు రూ. 5 వేల కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు.
రైల్వే డివిజన్‌లోని గుంతకల్లు-బళ్లారి సెక్షన్‌లోని దాదాపు 46 కి.మీ.ల లైన్‌ను కూడా నాలుగు లైన్లుగా మారుస్తారు. కాగా ఎన్‌పీజీ ప్రతిపాదనల మేరకు దేశంలోని సికింద్రాబాద్-వాడి (173 కి.మీ.), వార్దా-భూసావల్ (314 కి.మీ.), వడోదర-రత్లాం (269 కి.మీ.), ఇటార్సి-భూపాల్-బీనా (237 కి.మీ.), గోండియా-డోంగర్‌ఘర్ (84 కి.మీ.), రత్లాం-నాగ్దా-వార్దా-బలార్షా, బద్లాపూర్-కర్జత్ రూట్లను కూడా నాలుగు లైన్లుగా మార్చడానికి దాదాపు రూ.60 వేల కోట్లతో ప్రతిపాదించారు. తమిళనాడులోని ఈరోడ్-కరూర్, అరక్కోణం-రేణిగుంట డబుల్ ట్రాక్‌ను, తెలంగాణలో కూడా పలు డబుల్ రూట్లను నాలుగు లైన్లుగా చేసే యోచనలో ఉన్నారు.
సరుకు రవాణా సులభతరం
గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి రూట్లను నాలుగు లైన్లుగా మార్చడం ద్వారా ఈ మార్గాల్లో సరుకు రవాణా ట్రాఫిక్‌ను భారీ స్థాయిలో పెండానికి, ప్రయాణ రైళ్ల వేగాలను పెంచడానికి సాధ్యపడుతుంది. రైల్వే దారుల కనెక్టివిటీని పెంచి విద్యుత్, సిమెంటు, తదతర పారిశ్రామిక కేంద్రాలకు బొగ్గు, ఉక్కు, సిమెంటు, గ్రానైట్, బాక్సైట్ ఖనిజాలను, సరుకుల రవాణాతో లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంగా రైల్వే ఈ కారిడార్లను అభివృద్ధి చేయనుంది. జేఎస్‌డబ్ల్యూ, కల్యాణి స్టీల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) సంస్థలకు సరుకు రవాణా సౌకర్యాలను పెంచనున్నారు.
బళ్లారి, తోరణగల్లు, హోస్పేట, గినిగెర ప్రాంతాలకు ఖనిజాల రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితోపాటు వస్త్ర, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్, ఇంధన రంగాల సరుకు రవాణాలో గణనీయమైన ప్రగతిని సాధించడానికి ఈ నాలుగు లైన్ల రైల్వే ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు. మిషన్ 3000 మెట్రిక్ టన్నుల వార్షిక సరుకు రవాణా లక్ష్య సాధన కోసం హైడెన్సిటీ ట్రాఫిక్ రూట్ల (అమృత్ చతుర్భుజ్) కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. 2026-27 వార్షిక కేంద్ర బడ్జెట్టులో ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే 2031కల్లా క్వాడ్రప్లింగ్ రైల్వే లైన్ల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News