ఇక 28 జడ్పీలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:51 AM
రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్(జడ్‌పీపీ)ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రస్తుత 13 జడ్‌పీపీల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక 28 జడ్పీలు
ఆయా జిల్లాల పరిధిలో 660 ఎంపీపీలు
అదనంగా 15 సీఈఓ, 15 డిప్యూటీ సీఈఓ పోస్టులు
24తో ముగియనున్న 13 జడ్పీల పదవీకాలం
ఆ తరువాత నుంచి పునర్వ్యవస్థీకరణ మొదలు
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్(జడ్‌పీపీ)ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రస్తుత 13 జడ్‌పీపీల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 13 జడ్పీల పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ తరువాత కొత్త జిల్లాల భౌగోళిక పరిధికి అనుగుణంగా జడ్‌పీపీల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఏర్పాటుచేసే ప్రతి జిల్లా ప్రజాపరిషత్‌కు సంబంధిత జిల్లా పరిధిలోని మండల ప్రజాపరిషత్(ఎంపీపీ)లు అనుబంధంగా ఉంటాయి. భవిష్యత్తులో ఏదైనా ఎంపీపీ పునర్వ్యవస్థీకరణ, ఏర్పాటు, విలీనం లేదా సరిహద్దుల మార్పు జరిగితే దానికి అనుగుణంగా జడ్‌పీపీ పరిధిలోనూ మార్పులు జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన అనుబంధంలో 28 జిల్లాల్లో 660 ఎంపీపీలను చూపించింది. వాటిని సంబంధిత జడ్‌పీల పరిధిలో మ్యాపింగ్ చేయాలని పీఆర్ కమిషనర్‌ను ఆదేశించింది.
30 అదనపు పోస్టులు...
28 జడ్‌పీపీలకు ప్రత్యేక కార్యనిర్వాహక నాయకత్వం కల్పించేందుకు ప్రభుత్వం 30 అదనపు పోస్టులకు అనుమతి ఇస్తూ మరో ఉత్తర్వు ఇచ్చింది. ఇందులో 15 జడ్‌పీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పోస్టులు, 15 డిప్యూటీ సీఈఓ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతమున్న మినిస్టీరియల్, సపోర్టింగ్ సిబ్బందిని హేతుబద్దీకరించి 28 జడ్‌పీపీలకు కేటాయించనున్నారు. మండల ప్రజాపరిషత్‌ల సంఖ్య, భౌగోళిక పరిధి, పనిభారం, అవసరాలు, నిర్దేశిత సిబ్బంది ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఈ కేటాయింపులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబరు 24 తరువాత కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లా పరిషత్‌కూ సంబంధిత జిల్లా పేరు పెట్టి, ఆ జిల్లాలోని ఎంపీపీలపై అధికార పరిధిని కల్పించనున్నారు. ఆమేరకు అధికారిక రికార్డులు, రిజిస్టర్లు, నోటిఫికేషన్లు, పరిపాలనా వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, సంబంధిత మండల ప్రజాపరిషత్ అధికారులు కొత్త వ్యవస్థకు సజావుగా మారేందుకు సహకరించాలని పేర్కొంది. జిల్లా ప్రజా పరిషత్‌ల ఏర్పాటు, పునర్యవస్థీకరణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994, దాని కింద రూపొందించిన నిబంధనలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చేపట్టనున్నారు. ఈ ఉత్తర్వులు చట్టబద్దమైన నోటిఫికేషన్లు జారీచేసి, అవసరమైన శాసన, పరిపాలనా, ఆర్థిక ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వార్తలను కూడా చదవండి
బొబ్బిలిలో బాలఏసు విగ్రహం కూల్చివేత