మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:09 AM
మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) 57 ఏళ్ల వయసులో విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఏలూరు నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు; ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు.
గుండెపోటుతో విశాఖలో కన్నుమూత
3 రోజుల కిందట మెడ నొప్పి
స్పాండిలైటిస్ అన్న వైద్యుడు
మంగళవారం ఉదయం టిఫిన్ తిని గదిలోకి వెళ్లగానే మృతి
2024లో ఓటమి తర్వాత వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలో చేరిక
వివాద రహితుడు: లోకేశ్ సంతాపం
విశాఖపట్నం/ఏలూరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత, వైసీపీ హయాంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఉరఫ్ ఆళ్ల నాని ఇకలేరు. మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆళ్ల నానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వస్థలం ఏలూరు అయినప్పటికీ గత కొంతకాలంగా విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఉంటున్నారు. నాని మంగళవారం ఉదయం అల్పాహారం తిని.. విశ్రాంతి నిమిత్తం తన గదిలోకి వెళ్లారు. ఉదయం 11 గంటల తర్వాత ఆయన భార్య రేఖ ఆ గదిలోకి వెళ్లి చూడగా నాని కిందపడిపోయిన స్థితిలో కనిపించారు. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
నాని మూడు రోజుల కిందట మెడనొప్పిగా ఉందని వైద్యుడిని సంప్రదించగా స్పాండిలైటిస్ వల్ల వచ్చి ఉంటుందని చెప్పినట్టు సన్నిహితులు తెలిపారు. కాగా, ఏలూరుకు చెందిన ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందాక, 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తిరిగి 2019లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత 2025లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కొద్దికాలంగా ఆయన విశాఖలో ఉంటున్నారు. ఆయన కుమారులు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు.
దిగ్ర్భాంతికరం: లోకేశ్
నాని మృతి చెందారన్న సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళి, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి, పలువురు వైసీపీ నాయకులు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి.. నాని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, ఆళ్ల నాని పార్దివదేహాన్ని ఏలూరుకు తరలించారు. కాగా, ఆళ్ల నాని మృతి వార్త తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. వివాద రహితుడి, అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా నాని పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆళ్ల నాని రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగారు. తండ్రి సూర్యచంద్రరావు న్యాయవాది. తల్లి గృహిణి. నాని 1969, డిసెంబరు 30న ఏలూరులో జన్మించారు. నాని బీకామ్ చదివారు. వ్యవసాయం చేస్తున్న పెద్ద అన్నయ్య ఆళ్ల కాళీకృష్ణ ప్రసాద్ తల్లి అస్తికలు తీసుకెళ్తూ గుండె పోటుతో 2021లో కన్నుమూశారు. ఇద్దరు అక్కలు, తమ్ముడు బాబ్జీ(సురేశ్) ఉన్నారు. బాబ్జీ బాదంపూడిలోని కాళీకృష్ణ ఆశ్రమం నిర్వహణ చూస్తుంటారు. ఆళ్ల నాని పెద్ద కుమారుడు మణిచంద్ అమెరికాలో ఎంఎస్ చదివి ఉద్యోగం చేస్తున్నారు. రెండో కుమారుడు ఆశిష్ విదేశాల్లో ఎంబీఏ చదువుతున్నారు. ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిలో నాని కీలక పాత్ర పోషించారు.
ఏలూరు నగరానికి తీవ్ర నీటి ఎద్దడి నివారణకు రూ.85 కోట్లతో గోదావరి నీటిని అందించే పథకాన్ని పూర్తి చేశారు. రూ.6 కోట్ల వ్యయంతో ఏలూరు ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయించారు. నగరంలో వన్‌టౌన్‌లో భూగర్భ డ్రైనేజీ అభివృద్ధికి చర్యలు ఆరంభించినా.. అదీ పూర్తి కాలేదు. ఏలూరు నగరానికి ముప్పుగా మారిన తమ్మిలేరు వరద నివారణకు పరివాహాక ప్రాంతాల్లో దశలవారీగా రివిట్‌మెంట్‌ను రూ.90 కోట్లతో పూర్తి చేయించారు. నగరంలో పేదల ఇళ్ల కాలనీలు ఏర్పాటుకు కృషి చేశారు. ఆళ్ల నాని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండే వారు. కాంగ్రెస్ యువజన నాయకుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వీరాభిమానిగా మారారు.
తీరని లోటు: టీ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: ఆళ్ల నాని హఠాన్మరణంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఆళ్ల నాని యూత్ కాంగ్రెస్‌లో ఎంతో చురుగ్గా పనిచేసేవారు. ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నాని పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలి’ అని పేర్కొన్నారు.
సీఎం సంతాపం
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుండెపోటుతో ఆయన దూ రమవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు.
‘మ్యాక్స్’ ముందే గుర్తించిందా!
సీతంపేట, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆళ్ల నాని హఠాన్మరణాన్ని ఆయన పెంపుడు శునకం ‘మ్యాక్స్’ ముందే పసిగట్టిందా అంటే.. అపార్టుమెంట్ వాచ్‌మన్ ఔననే చెబుతున్నారు. సాధారణంగా కొత్తవాళ్లు వచ్చినప్పుడు ఒకటి, రెండుసార్లు మాత్రమే మొరిగే మ్యాక్స్.. మంగళవారం ఉదయం ఎక్కువగా మొరిగిందని తెలిపారు. దాంతో ఏమైందో చూద్దామని నాని ఫ్లాట్‌కు వెళ్లగా.. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారని గుర్తించినట్టు వాచ్‌మన్ వివరించారు. నాని పార్థివ దేహం ముందు మ్యాక్స్ దిగాలుగా కూర్చుందని వాచ్‌మన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యాన హబ్‌కు ప్రపంచబ్యాంకు ఓకే!
మీ రాష్ట్రంతో మాకు చేదు అనుభవం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News