Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:15 PM
చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
- భయం.. భయం
- చిరుతలు, ఎలుగుబంట్ల సంచారంతో ఆందోళన
మడకశిర(అనంతపురం): చిరుతలు, ఎలుగుబంట్ల సంచారంతో గ్రామస్థులు భయం.. భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు దాడిచేస్తాయోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. రైతు ప్రకాష్ తనకున్న రెండు ఆవులను కొండ ప్రాంతంలోకి మేత కోసం తోలుకుని వెళ్లాడు. ఒక ఆవు భయానికి గురై వస్తుండగా దానిని ఇంటి వద్ద వదిలి మరో ఆవు కోసం ఆ రైతు ఆ ప్రాంతానికి వెళ్లాడు.
అయితే ఆవు అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి అడుగుజాడలను గుర్తించి చిరుతనేనని దృవీకరించారు. రూ. 40వేల దాకా నష్టం వాటిల్లినట్లు ప్రకాష్ తెలిపాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలో 30 శాతం పైబడి అటవీ, కొండలకు, గుట్టలకు, వాగులు వంకలకు ఆనుకొని పంట పొలాలు, గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా మంది వ్యవసాయం తరువాత పాడిపశువులు, గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మేత కోసం వాటిని తోలుకుని కొండలు, గుట్టలు అటవీప్రాంతాలకు వెళుతుంటారు.

రెండు సంవతరాలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం అధికమైందని ఆయాప్రాంతాలవాసులు అంటున్నారు. అటవీప్రాంతాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. వన్యప్రాణుల సంచారం ఎక్కువైందని, పశువులకేకాకుండా పంటలపైన కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు.
జింకలు, నెమళ్లు అధికంగా పంటలకు నష్టం కలిగిస్తున్నాయని, చిరుత, ఎలుగుబంట్లు పశువులపై దాడిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధితశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వణ్యప్రాణులు గ్రామాల వైపు, పోలాల వైపు రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్
Read Latest Telangana News and National News