Share News

గురువులపై దాడి ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ: మాజీ మంత్రి దేవినేని

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:54 PM

మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ టీచర్లపై వైసీపీ మూకల దాడి దుర్మార్గమైన చర్య అని, ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక మచ్చలా మిగిలిపోతుందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

గురువులపై దాడి ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ: మాజీ మంత్రి దేవినేని
devineni umamaheshwar rao on ycp attack

అమరావతి, సెప్టెంబర్ 21: ఏళ్ల తరబడి కష్టపడి చదివి మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన టీచర్లను మానసికంగా వేధించడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఈ దాడి ఒక మాయని మచ్చలాంటిదని ఆయన పేర్కొన్నారు. మైదానాల్లో రక్తం చిందించి రాష్ట్ర, దేశ ప్రతిష్ఠను పెంచిన క్రీడాకారులను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ అహంకారానికి పరాకాష్ట అని తీవ్రంగా మండిపడ్డారు.


‘సమాజంలో అశాంతి రేపాలనే సజ్జల కుట్రలో భాగంగానే బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు ఈ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతున్నారో తెలుసుకోవాలంటూ మందు షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టిన నీచ సంస్కృతి గొడ్డలి పార్టీది. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా.. ఒక్క మెగా డీఎస్సీ నిర్వహించని వైసీపీ ఇప్పుడు అర్హతతో ఉద్యోగాలు సాధించిన వారిపై దాడులకు దిగుతోంది. డీఎస్సీని అడ్డుకునేందుకు వందల కేసులు వేసినా.. న్యాయపోరాటాన్ని ఎదుర్కొని మెగా డీఎస్సీ నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిది. టీచర్ల తలలు పగలగొట్టి.. బూతుపదాలతో దూషించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. గురువులపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడి చేసిన గూండాలను శిక్షించాలి’ అని దేవినేని డిమాండ్ చేశారు.


విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న గొడ్డలి పార్టీ అధ్యక్షుడు.. సీబీఐ విచారణ గురించి మాట్లడడం సిగ్గుచేటని దేవినేని అన్నారు. డీఎస్సీ అంటే తెలుగుదేశం.. తెలుగుదేశం అంటే డీఎస్సీ అని ఆయన పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వమే జారీ చేసిన సర్టిఫికెట్లను వైసీపీయే ఇప్పుడు ఫేక్ అంటోందని ఎద్దేవా చేశారు. వైసీపీ ఫేక్ ప్రచారాలకు అభ్యర్థులు ఆధారాలతో సమాధానం ఇస్తున్నా.. అబద్ధాలను పదే పదే ప్రచారం చేయడం వారి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని దేవినేని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ అరాచకాలను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి.. గొడ్డలి పార్టీకి ప్రజలు గట్టి సమాధానం చెప్పబోతున్నారని దేవినేని ఉమామహేశ్వర్ రావు ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Updated Date - Sep 21 , 2026 | 09:43 PM