Share News

సీట్లున్నాయి.. విద్యార్థులే కావాలి!

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:26 AM

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నా...వాటిలో చేరేందుకు విద్యార్థుల సంఖ్య ఆ స్థాయిలో కనిపించడం లేదు.

సీట్లున్నాయి.. విద్యార్థులే కావాలి!

  • కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన 46వేల సీట్లు

  • మేనేజ్‌మెంట్‌లో మరో 50 వేల సీట్లు

  • ముగిసిన ఇంజనీరింగ్‌ తుది దశ కౌన్సెలింగ్‌

  • ఎడాపెడా సీట్లు పెంచుకోవడమే కారణం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నా...వాటిలో చేరేందుకు విద్యార్థుల సంఖ్య ఆ స్థాయిలో కనిపించడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు ఎడాపెడా సీట్లు పెంచుకుంటూపోతున్నా... అడ్మిషన్లు మాత్రం అందుకు అనుగుణంగా పెరగడం లేదు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం తుది దశ కౌన్సెలింగ్‌ తాజాగా పూర్తయ్యింది. కన్వీనర్‌ కోటాలోనే 46,234 సీట్లు (31 శాతం) మిగిలిపోయాయి. ఈ కోటాలో 1,51,204 సీట్లు ఉండగా 1,04,970 సీట్లు(69 శాతం మాత్రమే) భర్తీ అయ్యాయి. ఇవి కాకుండా మేనేజ్‌మెంట్‌ కోటాలో సుమారు మరో 50వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించలేనివారు, నేరుగా డబ్బుకట్టి అడ్మిషన్లు పొందేవారు మేనేజ్‌మెంట్‌ కోటాకు వెళ్తారు. అయితే, వారు తక్కువ మందే ఉంటారు.

కోర్సుల వారీగా ఇలా

కోర్సుల వారీగా చూస్తే కోర్‌ సీఎస్ఈలోనే 14,929 సీట్లు మిగిలిపోయాయి. సీఎస్ఈ-ఏఐఎంఎల్‌లో 2,836, సీఎస్ఈ డేటాసైన్స్‌లో 2,524,సీఎస్ఈ-ఏఐలో 3,004, సీఎస్ఈ-ఏఐ అండ్‌ డేటాసైన్స్‌లో 388, సీఎస్ఈ సైబర్‌ సెక్యూరిటీలో 307 సీట్లు మిగిలాయి. అంటే సీఎస్ఈ, దాని అనుబంధ కోర్సుల్లోనే 23,988 సీట్లు మిగిలిపోయాయి. సీఎస్ఈ యేతర కోర్సుల్లో ఈసీఈ కొంత పర్వాలేదనిపిస్తున్నా మిగిలిన కోర్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈసీఈలో 17,730 సీట్లు భర్తీ అవగా, 6,823 సీట్లు మిగిలాయి. ఈఈఈలో 8021 సీట్లు ఉండగా, వాటిలో 3218 సీట్లు మిగిలాయి. మెకానికల్‌లో 7,388 సీట్లు ఉండగా.. వాటిలో 2,679 సీట్లు మిగిలాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 5,849 సీట్లు ఉండగా 2,404 సీట్లు మిగిలాయి. ఐటీ బ్రాంచ్‌లో 3,123 సీట్లు ఉండగా 632 సీట్లు మిగిలిపోయాయి.


బ్రాంచ్‌ కంటే కాలేజీ ముఖ్యం..

ఏ కాలేజీ అయినా పర్వాలేదు సీఎస్ఈలోనే సీటు కావాలి అని కొందరు కోరుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం నచ్చిన కాలేజీలోనే ఏ బ్రాంచ్‌ అయినా పర్వాలేదని అడ్మిషన్లు పొందుతున్నారు. మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో కొందరు సీఎ్‌సఈ సీటు రాకపోయినా కొన్ని ప్రైవేటు వర్సిటీల్లో చేరారు. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎక్కడైనా సీఎస్ఈ సీటు వచ్చే వీలున్నా వారు విద్యాసంస్థకే ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్లే సీఎస్ఈలో సీట్లు మిగిలాయి.

Updated Date - Aug 28 , 2026 | 05:26 AM