వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 25కి చేరిన మృతులు
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:34 PM
వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.
కాకినాడ, ఫిబ్రవరి 04: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాద ఘటనలో మరొకరు మరణించారు. బుధవారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వీర శ్రీను (39) కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. మంగళవారం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోవరాజు మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని పోలాల మధ్య ఏర్పాటు చేసిన కేంద్రంలో బాణసంచాను కార్మికులు తయారు చేస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ఇద్దరు లోవరాజు, వీర శ్రీను.. మంగళ, బుధవారాల్లో మరణించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, ఈగల్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. ఈ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాలని జారీ చేసిన ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ప్రమాద ఘటనపై నెల రోజుల్లో నివేదిక అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్న ఉన్నతాధికారులు: బాల్క సుమన్
సమ్మర్ ఎఫెక్ట్.. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ సేల్స్..
Read Latest AP News And Telugu News