రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:54 AM
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
రాజమండ్రి, మార్చి 22: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. స్థానిక రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన పిచ్చుక నాగేశ్వరరావు (72) శనివారం అర్థరాత్రి మరణించారు. దీంతో కల్తీ పాల ఘటనతో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. కల్తీ పాలు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన నాగేశ్వరరావు కిడ్నీలు రెండు పాడయ్యాయి. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ అతడు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మరొక వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన చోటు చేసుకుంది. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) అనే అత్యంత విషపూరిత రసాయనం కలిసినట్లు అధికారులు నిర్ధారించారు. పాలను నిల్వ చేసే ఫ్రిజర్‌లో ఈ ఇథిలీన్ గ్లైకాల్ లీక్ అయ్యి.. పాల క్యాన్లలో కలవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో బహిర్గతమైంది. ఈ పాలు తాగిన వారిలో వృద్ధులు, చిన్నారులు అధికంగా ఉన్నారు. ఈ కల్తీ పాల ఘటనలో 64 ఏళ్ల కొండబాబు మాత్రమే కోలుకున్నారు.
ఈ కల్తీ పాలు తాగిన వారిలో అనూరియా, అక్యూట రీనల్ ఫెయిల్యూర్ తదితర లక్షణాలు కనిపించాయి. ఈ ఘటనతో తీవ్ర అనారోగ్యం పాలైన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుంది. ఈ ఘటనలో పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం: కేటీఆర్
For More AP News And Telugu News