Share News

విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి.. మాట్లాడిన విషయాలివే..

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:45 PM

కాకినాడలోని జేఎన్‌టీయూ విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కొంతమంది గొడవలు పెడుతున్నారని, ఏ కుటుంబంలో పుడతామో ఎవరి చేతుల్లోనూ ఉండదని లోకేశ్ వ్యాఖ్యానించారు..

విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి.. మాట్లాడిన విషయాలివే..
Minister Nara Lokesh

కాకినాడ, జనవరి 30: కాకినాడలో పర్యటించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara lokesh).. జేఎన్‌టీయూలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర చేసిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ప్రతి నెలా విద్యార్థులతో మాట్లాడతానని.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలా నిర్వహిస్తామని తెలిపారు. తాను చిన్నప్పుడు బట్టీ పట్టి చదవలేదని, పాఠం మొత్తం విని నేర్చుకునేవాడినని గుర్తుచేశారు. కుంభమేళా కార్యక్రమం చూసి క్రౌడ్ మేనేజ్‌మెంట్ నేర్చుకున్నానని తెలిపారు.


మీరూ గుర్తుంచుకోండి...

‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మొదటిసారి హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు చూశాను. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. కష్టకాలంలో తోడుగా వచ్చిన వారిని ఎప్పుడూ మరచిపోకూడదు. మీరు కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలి’ అని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ సూచించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కొంతమంది గొడవలు పెడుతున్నారని, ఏ కుటుంబంలో పుడతామో ఎవరి చేతుల్లోనూ ఉండదని చెప్పారు. కెమికల్ ఇంజనీరింగ్ మంచి కోర్సు అని, భవిష్యత్తులో అనకాపల్లిలో కెమికల్ ఫార్మా కంపెనీలు పెడతామని లోకేశ్ తెలిపారు.


స్థానికులకే అవకాశం..

త్వరలో రాష్ట్రానికి 760 కంపెనీలు తీసుకొస్తున్నామని, అగ్రికల్చర్ ఎంత ముఖ్యమో.. పరిశ్రమలు కూడా అంతే ముఖ్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దావోస్ వెళ్లి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. 4 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని.. అందులో 80 శాతం స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి, మందులు అందుబాటులో తెచ్చామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో పరిష్కారం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


ఆసక్తికర సమాధానాలు..

విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘మీరెప్పుడైనా క్లాస్‌లకు బంక్ కొట్టారా?’ అని విద్యార్థులు అడగగా, లోకేశ్ నవ్వుతూ ‘తాను ఎప్పుడు బంక్ కొట్టలేదు’ అని సమాధానమిచ్చారు. తాను ఎంబీఏ చదువుతున్న సమయంలో 90% అటెండెన్స్ ఉందని, తన భార్య బ్రాహ్మణికి 100% అటెండెన్స్ ఉందని ఆయన చెప్పారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించిన లోకేశ్.. వారి సందేహాలను నివృత్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం

కూటమిని విడదీయడం ఎవరితరం కాదు: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 05:26 PM