Share News

మూడు పార్టీలు కలిసి పని చేస్తే తిరుగుండదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:52 PM

ప్రజా ప్రతినిధులు, అధికారులు పని తీరు ఏ విధంగా ఉందనే అంశంపై ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చిన సర్వే నివేదికలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆదేశించారు.

మూడు పార్టీలు కలిసి పని చేస్తే తిరుగుండదు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి: ప్రజా ప్రతినిధులు, అధికారులు పని తీరు ఏ విధంగా ఉందనే అంశంపై ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చిన సర్వే నివేదికలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆదేశించారు. పక్కా సర్వేలు చేసి టికెట్లు ఏ విధంగా ఇచ్చామో.. ఇప్పుడూ అదే విధంగా సర్వేలు చేయిస్తున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలు అద్భుతంగా ఉన్నాయని.. ప్రజలతో మమేకమైతే భవిష్యత్తులో చక్కటి విజయం దక్కించుకోవచ్చని చెప్పారు.


కులాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామని.. దానికి అనుగుణంగానే అన్ని కులాల్లో ఆదరణ పెరగాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సేవల్లో చిన్నపాటి లోపాలు కూడా ఉండకూడదని.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నెల్లూరు మోడల్ అవలంభించాలని సూచించారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలన్నారు. చెడు ప్రచారం వేగంగా వెళ్తుందని.. మంచి ప్రచారం నెమ్మదిగా వెళ్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు వ్యవహరించాలని హితవుపలికారు. కూటమి పార్టీలు సమన్వయంతో పని చేయాలని.. మూడు పార్టీల కేడర్ కలిసి పని చేస్తే తిరుగుండదని ప్రజాప్రతినిధులకు చెప్పారు.


ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ హాజరయ్యారు. అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రామచంద్రపురం ఎమ్మెల్యే, మంత్రి వాసంశెట్టి సుభాశ్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం..

యనమల రామకృష్ణుడుకి సీఎం చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..

Updated Date - Apr 11 , 2026 | 09:53 PM