Share News

ఏపీని ఉక్కు రాష్ట్రంగా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:59 PM

ఆంధ్రప్రదేశ్‌ను ‘స్టీల్ స్టేట్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివరాల్లోకి వెళితే..

ఏపీని ఉక్కు రాష్ట్రంగా మారుస్తాం: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

అమరావతి, జులై 3: ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త పారిశ్రామిక హబ్‌గా, ముఖ్యంగా 'స్టీల్ స్టేట్'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ స్టీల్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాన్ని కూడా 'ఉక్కుసీమ'గా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో స్టీల్ ప్లాంట్ పేరుతో కొందరు ఐరన్ ఓర్‌ను దోచుకుంటూ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువచ్చామన్నారు. అంతేకాదు స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఇక్కడి యువతకే ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తీసుకురావడం వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారాయన్నారు. ఇప్పటివరకూ అక్కడ 19 లక్షల కార్లు తయారయ్యాయని గుర్తుచేశారు. రాయలసీమకు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి హయాంలో మంచి జరిగిందో ప్రజలు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు.


సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ సంస్కృతిని అంతం చేశామని, సీమలో పారాల్సింది రక్తం కాదు.. సాగునీరు. ఫ్యాక్షనిజం పోయినప్పటికీ, నేరాలు చేసేవాళ్లు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరం. విధ్వంసమే అజెండాగా పెట్టుకున్న ఒక వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయగలరు. 2014లో అమరావతిని రాజధానిగా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు, అయితే అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానులంటూ నవ్వులపాలు చేశారు. మావిగన్, విజయవాడ అంటూ మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారు. రేపు ఇంకేమంటారో తెలియని పరిస్థితి. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. రాష్ట్రంలో రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఇలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం.’ అని సీఎం తెలిపారు.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ కేసు.. కోర్టుకు కీలక విషయాలు తెలిపిన సిట్

రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 03:20 PM