రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:02 PM
రుషికొండ భవనాల విషయంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హిల్‌టాప్‌లోని భవనాల నిర్వహణ, ఆపరేషన్, మార్కెటింగ్ కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెస్ట్‌ను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
అమరావతి, జులై 3: రుషికొండ భవనాల విషయంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. హిల్‌టాప్‌లోని భవనాల నిర్వహణ, ఆపరేషన్, మార్కెటింగ్ కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెస్ట్ (EOI)ను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) మోడల్‌లో రుషికొండ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించనుంది. ఎంపికైన ప్రైవేట్ సంస్థ.. ఐదు భవనాల సముదాయాన్ని నిర్వహించనుంది.
మొత్తం 9.8 ఎకరాల హిల్‌టాప్ ప్రాజెక్టును O&M మోడల్‌లో ప్రభుత్వం వినియోగించనుంది. రుషికొండ దిగువ ప్రాంతంలో ఉన్న మరో 9 ఎకరాల భూమి అభివృద్ధికి కూడా అవకాశం కల్పించనుంది. హోటళ్లు, రిసార్టులు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఏపీటీడీసీ తెలిపింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యూయింగ్ ఏరియాలు, ఓపెన్ స్పేస్‌లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు విధించింది. ప్రస్తుత భవనాలతో పాటు అదనపు అభివృద్ధికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండు ఖాళీ స్థలాల్లో మొత్తం 2,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధికి అవకాశం ఉండగా, అదనంగా సుమారు 4,800 చదరపు మీటర్ల వరకు జీ+1 నిర్మాణాలకు అనుమతి ఇవ్వనుంది.
సీఆర్‌జెడ్ నిబంధనలు, చట్టబద్ధ అనుమతుల ప్రకారమే అన్ని నిర్మాణాలు చేపట్టాలని ఏపీటీడీసీ స్పష్టం చేసింది. పెట్టుబడిదారుల ఆసక్తి, ప్రాజెక్టు వాణిజ్య సాధ్యాసాధ్యాలను EOI ద్వారా అంచనా వేసి... అనంతరం ఆర్‌ఎఫ్‌పీ (RFP) దశలో తుది ఎంపిక ప్రక్రియ జరగనుంది. హోటల్ చైన్లు, రిసార్ట్ డెవలపర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీటీడీసీ వెల్లడించింది. హాస్పిటాలిటీ రంగంలో అనుభవం ఉన్న సంస్థలకే అర్హత కల్పించనున్నట్లు తెలిపింది. మార్చి 31, 2025 నాటికి పాజిటివ్ నెట్‌వర్త్ తప్పనిసరి అని పేర్కొంది. EOI దాఖలుకు చివరి తేదీ జులై 10 సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించారు. తుది లీజ్ నిబంధనలు, ఆదాయ భాగస్వామ్యం తదితర అంశాలను RFP దశలో ఖరారు చేయనున్నట్లు ఏపీటీడీసీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి...
పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు
సాయికృష్ణ కేసు.. కోర్టుకు కీలక విషయాలు తెలిపిన సిట్
Read Latest AP News And Telugu News