రూ.105 కోట్లతో కొత్త ఏపీ భవన్
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:28 AM
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రానికి పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది.
2.5 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
బాధ్యతలు ఎన్‌బీసీసీకి అప్పగింత
న్యూఢిల్లీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రానికి పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.105.5 కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ)కు అప్పగించింది. సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే కొత్త ఏపీ భవన్‌కు చెందిన ప్లానింగ్, డిజైన్, నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఎన్‌బీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ పరిధిలోని నవరత్న సంస్థ అయిన ఎన్‌బీసీసీ.. ఈ ప్రాజెక్టు ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను టర్న్ కీ పద్ధతిలో చేపట్టనుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం ఐదేళ్లపాటు భవన్ వార్షిక నిర్వహణ బాధ్యత కూడా ఈ సంస్థదే.