Share News

కంభంలో విషాదం.. పెళ్లి వేడుకకు వెళ్తుండగా లారీ బీభత్సం..

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:43 AM

మార్కాపురం జిల్లా కంభంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

కంభంలో విషాదం.. పెళ్లి వేడుకకు వెళ్తుండగా లారీ బీభత్సం..

మార్కాపురం: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా కంభంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరులోని నల్లబండ బజారుకు చెందిన ఆవుల వీరక్కకు కంభంకు చెందిన పాములేటితో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోతో పాటు అక్కడ ఉన్న వారి పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి ఆవుల నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో పెళ్లికూతురు ఆవుల వీరక్కతో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారడంతో ఇరు కుటుంబాలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి

న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురండి

‘సెట్‌’ల్లో 3.63 లక్షల మందికి అర్హత

Updated Date - Jul 03 , 2026 | 07:52 AM