మీ నమ్మకం వృథా కాదు!
ABN , Publish Date - Mar 25 , 2026 | 10:54 AM
‘ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు.
గ్రామగ్రామానా అభివృద్ధి వెలుగులు
ఏడాది ఓపికపడితే వేలకొద్దీ ఉద్యోగాలు
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం(చిత్తూరు): ‘ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు. గ్రామగ్రామానా అభివృద్ధి వెలుగులు పంచుతారు’ అని నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన ఆమె, తొలి రోజైన మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంకలదొడ్డి, సింగారపురం, మోట్లచేను, కూసూరు, పైపాళ్యంలలో మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. కుప్పంలో రూ.2,203 కోట్ల అభివృద్ధి పనులు జరగుతున్నాయన్నారు. ‘కుప్పానికి రూ.7,121 కోట్ల పెట్టుబడితో 17 పరిశ్రమలు రాబోతున్నాయి.
ఇప్పటికే అందులో రూ.2,203 కోట్ల పెట్టుబడితో కొన్ని కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ పరిశ్రమల వల్ల 7,093 మందికి ప్రత్యక్షంగా, 15,237 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏడాది ఓపిక పడితే మన బిడ్డలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి’ అంటూ లెక్కలు చెప్పారు. గతంలో పోలిస్తే తాగునీటి సమస్యపై తనకు అందిన అర్జీలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయన్నారు. కృష్ణా జలాలను కుప్పం తీసుకురావడమే దీనికి కారణమన్నారు. గత ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణంలో సీఎం చంద్రబాబు బిజీగా ఉండటంతో ఆయన తరపున తాను మూడు నెలలకోసారి కుప్పం వచ్చి ప్రజల సాదకబాధకాలు తెలుసుకుంటున్నానన్నారు.
విద్యార్థులతో ముచ్చట్లు: మంకలదొడ్డిలోని అంగన్వాడీ కేంద్రాన్ని, టి.సదుమూరు జడ్పీ ఉన్నత పాఠశాల, పైపాళ్యంలో విలువల బడిని భువనేశ్వరి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. క్రమశిక్షణ, పట్టుదల, పరిశ్రమ, విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానాలకు చేరుస్తుందన్నారు. మోట్లచేనులో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు బహమతులు ప్రదానం చేశారు. ‘మా గ్రామంలోని పాఠశాలకు రాకపోకలు సాగిచేందుకు బస్సు సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఊర్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటు చేయాలి’ అని విద్యార్థులు ఆమెను కోరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వారి వెనుక నేను, బ్రాహ్మణి
సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ విజయవంతమైన నేతలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారంటే వారిని వెనుకనుంచి నడిపించే తాను, బ్రాహ్మణి కారణమని భువనేశ్వరి పేర్కొన్నారు. అలాగే ఆయా కుటుంబాలు అభివృద్ధి పథంలో పయనించాలన్నా స్త్రీ చోదక శక్తి కావాలని పిలుపునిచ్చారు. కుప్పంలో మహిళా సాధికారతకోసం చంద్రబాబు ఎన్నో అవకాశాలు సృష్టించారని గుర్తుచేశారు. అలీప్ సంస్థ ద్వారా మహిళలకు ఆసక్తి కలిగిన రంగాల్లో శిక్షణ ఇస్తున్నారని, దీనికోసం పేర్లను రిజిస్టర్ చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
Read Latest Telangana News and National News