Share News

తిరుపతి- విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం..

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:09 PM

తిరుపతి- విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ఆయన సర్వీసులకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చిన తొలి విమానానికి అధికారులు, సిబ్బంది వాటర్ కేనన్ సెల్యూట్‌తో ఘనస్వాగతం పలికారు.

తిరుపతి- విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం..
Fly91 Tirupati flights

తిరుపతి జిల్లా: తిరుపతి, విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇవాళ (గురువారం) వర్చువల్‌గా హాజరైన ఆయన సర్వీసులకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చిన తొలి విమానానికి అధికారులు, సిబ్బంది వాటర్ కేనన్ సెల్యూట్‌తో ఘనస్వాగతం పలికారు.


కాగా, ఫ్లై91 (Fly91) సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌కు విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు తిరుపతి-విజయవాడ మధ్య విమాన సర్వీసు వారానికి నాలుగు రోజులపాటు కొనసాగనుంది. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం రోజుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో తిరుపతి నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది.


అలాగే, తిరుపతి-రాజమహేంద్రవరం మధ్య విమాన సర్వీసును ఫ్లై91 ప్రారంభించింది. సోమవారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులు, ఇతర ప్రయాణికులకు ఈ కొత్త సర్వీసులు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. దీంతో రాష్ట్రంలోని కీలక నగరాల మధ్య విమాన ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.


మరోవైపు, తిరుపతి నుంచి కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ పెంచడం ద్వారా తిరుపతి ప్రాంతానికి మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయని ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..

పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ చోరీ.. ఏకంగా రూ.75 లక్షల సొత్తు స్వాహా..

Updated Date - Sep 10 , 2026 | 06:17 PM