Share News

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:16 PM

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చింది. 11 పేజీలతో కూడిన ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖ రాసింది.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు
Tirumala laddu ghee case, Supreme Court SIT report

అమరావతి, ఫిబ్రవరి 3: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏపీ ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించింది. 2019-2024 మధ్య కాలంలో జరిగిన ఘోర తప్పిదాలు, నిబంధనల ఉల్లంఘనలు, ఉద్దేశ్యపూర్వక మోసాలను వివరిస్తూ 11 పేజీల లేఖలో SIT తన దర్యాప్తు అంశాలను పేర్కొంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.


SIT నివేదిక.. కీలక అంశాలు..

టెండర్ నిబంధనల మార్పు: 2020లో ఎటువంటి అధ్యయనం, శాస్త్రీయత లేకుండా టెండర్ కండిషన్లు మార్చారు. దీంతో అర్హత లేని కంపెనీలకు టెండర్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. 2020-2023 మధ్య ఈ అర్హత లేని కంపెనీలే కల్తీ నెయ్యి సరఫరా చేశాయి.

నిబంధనల రిలాక్సేషన్: నెయ్యి సరఫరా సంస్థలకు కనీసం రూ.250కోట్ల టర్నోవర్ ఉండాలన్న నిబంధనను రూ.150 కోట్లకు తగ్గించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాదికి కుదించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరణ నిబంధనను పూర్తిగా తొలగించారు. అలాగే, 12 టన్నుల వెన్న తీయాల్సిన నిబంధనను 8 టన్నులకు తగ్గించారు.

టీటీడీ పర్చేజ్ కమిటీ పాత్ర: పర్చేజ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్రను SIT నిర్దిష్టంగా ప్రస్తావించింది. టెండర్ కండిషన్లు మొదలుకుని నెయ్యి సరఫరా వరకు ప్రతి అంశంలో ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.

అధికారుల బాధ్యత: మొత్తం ప్రక్రియ తప్పుదారి పట్టడంలో FA&CAO బాలాజీ, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యులని SIT పేర్కొంది. అర్హత లేని డైరీల నుంచి కల్తీ నెయ్యి కొనుగోలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని నివేదికలో తెలిపారు.

CFTRI పరీక్షలు: కల్తీ నెయ్యిపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో 2022 మే 25న సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CFTRI)కు శాంపిల్స్ పంపారు. పరీక్షల్లో వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీల నుంచి వచ్చిన నెయ్యి కల్తీ అయినట్టు నిర్ధారణ అయింది. అయితే, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి సహా అధికారులు ఈ నివేదికను పరిగణలోకి తీసుకోలేదు.

వరుస మోసాలు: వరుస తప్పిదాలు, మోసాలతో కల్తీ నెయ్యి సరఫరాకు అనేక దశల్లో టీటీడీ పెద్దలు సహకరించారని SIT తన దర్యాప్తులో తేల్చింది.


ఇవి కూడా చదవండి..

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

Updated Date - Feb 03 , 2026 | 07:16 PM