Share News

పోలీసులను ఎలా వాడుకున్నారో గుర్తు లేదా సజ్జల?: ఎమ్మెల్సీ కంచర్ల

ABN , Publish Date - Apr 15 , 2026 | 08:30 PM

వైసీపీ నేతల అరెస్టులో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. అక్రమ కేసులు పెట్టారని రాద్ధాంతం చేస్తున్నారని సజ్జలపై మండిపడ్డారు.

పోలీసులను ఎలా వాడుకున్నారో గుర్తు లేదా సజ్జల?: ఎమ్మెల్సీ కంచర్ల
MLC Kancharla Srikanth

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద పోస్టులు పెట్టిన వైసీపీ నేతలు పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పూడి శ్రీహరిని అరెస్టు చేయగా.. నేడు గిరీశ్ కుమార్ రెడ్డిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టులను వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టులుగా అభివర్ణించారు. కుట్రపూరిత కేసులు పెట్టారని ఆరోపణలు గుప్పించారు.


సజ్జల వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. అక్రమ కేసులు పెట్టారని రాద్ధాంతం చేస్తున్నారని సజ్జలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ గత ఐదేళ్ల పాలనను గుర్తు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు నమోదు చేశారో గుర్తు లేదా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసుకోవాలనుకున్నా నిర్బంధించి.. అక్రమ కేసులతో జైలుకు పంపిన విషయం గుర్తు లేదా? అని మండిపడ్డారు.


ఆనాడు పోలీసులను వైసీపీ ఏ విధంగా వాడుకుందో మర్చిపోయారా? అంటూ ఎమ్మెల్సీ కంచర్ల ధ్వజమెత్తారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే వేల కేసులు తమపై పెట్టారని.. ఆ కేసుల్లో ఇప్పటికీ జైళ్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తరహాలో వెళ్లకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తమకు పదేపదే ఆదేశాలు ఇస్తున్నారని ఎమ్మెల్సీ చెప్పుకొచ్చారు. వైసీపీ విధానాలనే కూటమి ప్రభుత్వం అనుసరించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం.. క్రీడాకారులకు మంత్రి లోకేశ్ హామీ..

సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వైసీపీ నేత గిరీశ్ కుమార్ రెడ్డి అరెస్టు..

Updated Date - Apr 15 , 2026 | 08:37 PM