నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:52 PM
తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను ఎంపిక చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 15: తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను ఎంపిక చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన యువనేత లోకేశ్ తొలిసారిగా తమ ప్రాంతానికి రావడంతో చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ఆయనను ముంచెత్తారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘ప్రత్యర్థులు బెదిరించినా భయపడకుండా తొడగొట్టి ఎన్నికల బరిలో నిలబడిన అంజిరెడ్డి తాత.. ప్రాణం పోతున్నా ప్రత్యర్థి పేరు తన నోట పలకని తోట చంద్రయ్య.. రక్తమోడుతున్నా పోలింగ్ బూతులో కూర్చున్న మంజులారెడ్డి నాకు స్పూర్తి. మీ అందరి త్యాగాల వల్లే 94 శాతం సీట్లతో ఈ రోజు మేమంతా ఇక్కడ కూర్చున్నాం. ప్రజలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలుంటాయని పాదయాత్రలో చెప్పా.. అదే ఇప్పుడు చేస్తున్నాం. మేం వారి మాదిరిగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు’..
‘అభంశుభం తెలియని అమర్నాథ్ గౌడ్, అబ్ధుల్ సలాం, తోట చంద్రయ్య వంటి వారిని నిర్ధాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు. దోషులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటున్నాం. మూడు రోజుల క్రితం దేవాలయానికి అడ్డుగా ఉన్న కారు తీయమని చెప్పినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు భక్తులపై దాడిచేశారు. భక్తులపై దాడిచేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అటువంటి దుశ్చర్యకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితాన్ని చంద్రగిరి నుంచే ప్రారంభించారు’ అని అన్నారు.
లోకేశ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘యువగళం పాదయాత్రలో చంద్రగిరి నాకు టర్నింగ్ పాయింట్. ఈ రోజు ఇక్కడే నా రాజకీయ పదోన్నతికి సంబంధించిన శుభవార్త విన్నాను. అందుకే చంద్రగిరి మాకు అచ్చివచ్చిన నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారు. కార్యకర్తల కోసం సుమారు రూ.150 కోట్ల బీమా సొమ్ము వెచ్చించాం. గత ప్రభుత్వంలో కేడర్‌పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చాలా వరకు క్లియర్ చేశాం. మిగిలినవి కూడా త్వరలో విడుదల చేస్తాం. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత మేం తీసుకుంటాం. కోటిమంది సభ్యులు గల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం’..
‘ఇంత పెద్ద కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం. నమ్మిన సిద్ధాంతం కోసం కేడర్ కలసికట్టుగా కష్టపడి పనిచేయాలి. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. అధునాతన టెక్నాలజీతో ప్రతి కార్యకర్త చేసే పనిని ట్రాక్ చేస్తున్నాం. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను ‘మై టీడీపీ యాప్’ ద్వారా గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తాం. చంద్రగిరి చెవిలో పువ్వుగా పేరొందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగనే నమ్మడం లేదు. ఆయన చేతివాటం జగన్‌కు అర్థమైంది. మద్యంలో 600 కోట్లు కొట్టేశాడు. దేవుడి లడ్డూలు, వస్త్రాలను సైతం అమ్ముకున్నాడు. అటువంటి అవినీతిపరుడి నుంచి చంద్రగిరి ప్రజలకు విముక్తి లభించింది. ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గంలో పనుల కోసం మా వెంట పడుతుంటారు. గత 22 నెలల్లో నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది. చిన్నచిన్న సమస్యలను పక్కనబెట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ కలసికట్టుగా ప్రత్యర్థులపై పోరాడాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరం!
ఆకివీడు రామాలయానికి రూ.కోటి విరాళం: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ