Share News

పెళ్లి పేరుతో ఎంబీబీఎస్ విద్యార్థినికి వల.. మతం మారాలంటూ బ్లాక్‌మెయిల్..

ABN , Publish Date - Oct 02 , 2026 | 09:07 PM

పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు.. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆపై యువతి పెళ్లి పేరు ఎత్తగానే మతం మారాలంటూ ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.

పెళ్లి పేరుతో ఎంబీబీఎస్ విద్యార్థినికి వల.. మతం మారాలంటూ బ్లాక్‌మెయిల్..
MBBS Student Issue

తిరుపతి: పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు.. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆపై యువతి పెళ్లి పేరు ఎత్తగానే మతం మారాలంటూ ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినికి ఓ వర్గానికి చెందిన యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు.. బాధితురాలిని తిరుపతికి పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం యువతి వివాహం గురించి ప్రస్తావించగా.. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానంటూ ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు. మతం మారేందుకు బాధితురాలు నిరాకరించగా.. వారిద్దరూ సన్నిహితంగా మెలిగిన ప్రైవేటు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ నిందితుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ మేరకు యువతి తమను ఆశ్రయించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.


కాగా, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఇతరులతో పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 112, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

గాంధీజీ స్ఫూర్తితోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు

బాక్సర్ అంకుష్ పంఘల్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు..

Updated Date - Oct 02 , 2026 | 09:14 PM