పూత బాగుంది..జాగ్రత్తలు తీసుకోండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:56 AM
అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు.
తిరుపతి: అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు. ఈదశలో మామిడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.మామిడి పూత జనవరి రెండోవారంలో మొదలై, ఇప్పుడు చిన్నపిందె దశకు చేరుకుందన్నారు. చలివాతావరణం ఉన్న జనవరిలో వచ్చిన పూత ఎక్కువభాగం మగపూలు రావడంతో చాలావరకు రాలిపోయిందన్నారు.
ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగడంతో ఫిబ్రవరిలో వచ్చిన పూతలో పిందె బాగా కడుతోందని, మున్ముందు ఉష్ణోగ్రతలు పెరిగేక్రమంలో రైతులు చెట్లలో ఏర్పడిన పిందెలను సంరక్షించుకోవాలన్నారు. పూత, పిందె ఏర్పడే ఈ దశలో మామిడిచెట్లకు నీరు పెట్టాలని సూచించారు. మామిడి పిందెను ఆశించే తామర పురుగులు, గొంగళిపురుగు మచ్చ తెగులు, పిందెరాలుడు సమస్యలకు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. లాన్సర్ గోల్డ్ లేదా ఒడిస్ లీటరు నీటికి 2గ్రాములు,
నేటివో లీటరు నీటికి 1.5గ్రాములు, ప్లానోఫిక్స్ లీటరు నీటికి 0.25మిల్లీలీటర్లు కలిపి స్ర్పేచేయడం వల్ల సమస్యని అధిగమించవచ్చన్నారు. అయితే అర్హత, పరిజ్ఞానం లేని ప్రైవేట్ సంస్థల సిబ్బంది, యూట్యూబర్ల మాయమాటలకు రైతులు దూరంగా ఉండాలని, ప్రామాణిక కంపెనీల ఉత్పత్తులనే ఉపయోగించాలని, నిపుణుల సలహాలు పాటించడం వల్ల ఫలితాలు బాగుంటాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..
Read Latest Telangana News and National News