లారీ డ్రైవర్ పేరిట రూ.36 కోట్ల జీఎస్టీ లావాదేవీలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:27 AM
తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ సమీర్ పత్రాలను దుర్వినియోగం చేసి అతని పేరుతో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలల్లో రూ.36 కోట్ల లావాదేవీలు నమోదైన వ్యవహారంలో చిత్తూరుకు చెందిన రెహ్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడి పేరిట చిత్తూరువాసి అక్రమ లావాదేవీలు
బాధితుడు సమీర్ తెలంగాణ వాసి
జీఎస్టీ నోటీసులు రావడంతో కంగు
చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులకు ఫిర్యాదు
పోలీసుల అదుపులో నిందితుడు రెహ్మాన్
చిత్తూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అమాయకుల ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి వారి పేర్లపై జీఎస్టీ రిజిస్ర్టేషన్లు పొందడం.. అనంతరం భారీ మొత్తంలో వ్యాపార లావాదేవీలు జరిగినట్లు చూ పించి పన్ను, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడడం.. ఇదీ చిత్తూరులోని కొన్ని ముఠాల పని! వారిలో ఒకరు చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులకు చిక్కారు. తెలంగాణకు చెంది న ఓ లారీ డ్రైవర్ పేరు మీద రూ.36 కోట్ల మేర జీఎస్టీ లావాదేవీలు నమోదైన వ్యవహారంలో చిత్తూరుకు చెందిన ఎం.రెహ్మాన్ ఖాన్‌ను శుక్రవారం పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ సమీర్ గతంలో లారీ లోడ్ పనుల కోసం పలమనేరుకు వచ్చారు. ఆ సమయంలో లోడ్ ఇప్పిస్తామని నమ్మించి ఆయన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కొందరు తీసుకున్నారు. అనంతరం బాధితుడికి తెలియకుండా ఆయా పత్రాలను ఉపయోగించి ‘ఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో నకిలీ జీఎస్టీ రిజిస్ర్టేషన్ పొందారు. లారీ డ్రైవర్ సమీర్ పేరుతో నమోదైన జీఎస్టీ వివరాలకు సంబంధించి అధికారులు అతనికి నోటీసులు పంపడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 5 నెలల వ్యవధిలో సమీర్ పేరుతో రూ.36 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు తెలిసింది. తన వ్యక్తిగత పత్రాలను దుర్వినియోగం చేసి తన పేరుతో జీఎస్టీ రిజిస్ర్టేషన్ తీసుకుని ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని ఆరోపిస్తూ సయ్యద్ పలమనేరు అర్బన్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి రెహ్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని రెహ్మాన్ హైకోర్టును ఆశ్రయించాడు.
నిందితుడికి వైసీపీ నాయకులతో సంబంధాలు
జీఎస్టీ స్కామ్‌లో పోలీసుల అదుపులో ఉన్న రెహ్మాన్‌కు చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులతో సంబంధాలున్నట్లు సమాచారం. నిందితుడు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఇన్‌చార్జి విజయానందరెడ్డి తదితరులతో కలిసి తీసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి: