ఒకే ఒక్కడు చంద్రబాబు..!
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:17 AM
వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసి... పనులన్నీ పూర్తిచేసి.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనే ప్రారంభించి నీటిని విడుదల చేయడం ఒకే ఒక్కడు చంద్రబాబుకే సాధ్యమైందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు.
శంకుస్థాపన.. పనుల పూర్తి.. నీరివ్వడం ఆయనకే సాధ్యం: మంత్రి నిమ్మల
మార్కాపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసి... పనులన్నీ పూర్తిచేసి.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనే ప్రారంభించి నీటిని విడుదల చేయడం ఒకే ఒక్కడు చంద్రబాబుకే సాధ్యమైందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. గంటవానిపల్లి సభలో ఆయన మాట్లాడారు. తొలిదశను చెప్పిన సమయానికి పూర్తిచేసిన చంద్రబాబుకు, తమ ఊళ్లు, భూములు త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు మనం రుణపడి ఉండాలన్నారు. వైసీపీ హయాంలో జాతికి అంకితం అనేది ఒక నకిలీ ప్రక్రియ అని, కార్పెట్లపై నడిచి అప్పుడు జగన్ జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నీళ్లపై నడిచి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారన్నారు.
గ్రేట్ విజనరీ చంద్రబాబు: దుర్గేశ్
గ్రేట్ విజనరీ అనే పేరున్న సీఎం చంద్రబాబు గొప్ప పరిపాలనాదక్షుడని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మార్కాపురం, కంభం, శ్రీశైలం ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాలతోపాటు నల్లమల అందాలు కలుపుతూ రూపొందించిన ప్రణాళిక బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అరుదైన అవకాశం సీఎంకు: మాధవ్
ముప్పయ్యేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రాజెక్టును పూర్తిచేసి నీటి విడుదల చేసే అరుదైన అవకాశం సీఎం చంద్రబాబుకే దక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కరువు నేలపై బంగారు పంటలు పండే అవకాశం కల్పించిన ఆయనకు ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.
చంద్రబాబు పేరు చరిత్రలో: విలాసిని
‘వెలిగొండ కోసం పోరాటం చేసిన మా నాన్న పూల సుబ్బయ్య పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడం ద్వారా చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మా నాన్న కల చంద్రబాబు ద్వారా సాకారమైనందుకు సంతోషంగా ఉంది’ అని సుబ్బయ్య కుమార్తె విలాసిని అన్నారు.
ఇవి కూడా చదవండి