సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:25 AM
విశాఖపట్నం జిల్లా ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
లారీని కారు ఢీకొనడంతో చెలరేగిన మంటలు
ఆనందపురం-పెందుర్తి రహదారిలో ప్రమాదం
ఆనందపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం జిల్లా ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో మంటలు చెలరేగి అందులో ఉన్న యువకుడు సజీవ దహనమయ్యాడు. ఆనందపురం సీఐ ఎర్రంనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం...ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్‌కు చెందిన పోలాకి అమర్‌నాఽథ్ పాత్రో (28) హైదరాబాద్‌లో టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల పాతపరదేశిపాలెంలో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈనెల 27న గృహ ప్రవేశం చేశారు. అప్పటినుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే ఉన్నాడు. స్నేహితులను కలవడానికని చెప్పి ఆదివారం సాయంత్రం కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. సోమవారం తెల్లవారుజామున ఆనందపురం నుంచి పెందుర్తి వైపు సర్వీసు రోడ్డులో వస్తూ రామవరం పంచాయతీ సత్తరవు జంక్షన్ సమీపాన ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ సంఘటనలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో వెంటనే మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న అమర్‌నాథ్ మంటల్లో చిక్కుకుపోయాడు. స్థానికులు బయటకు తీసేందుకు యత్నించినా మంటలు వల్ల సాధ్యం కాలేదు. దీంతో కారులోనే సజీవ దహనం అయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో అతను ఒక్కరే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడి తల్లి పోలాకి ప్రశాంతి పాత్రో ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.