Share News

వినయం, నైతిక నాయకత్వానికి ప్రతీక.. రతన్‌ టాటా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:04 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా సేవలను దేశం ఎప్పటికీ మరువలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రతన్‌ టాటా వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. వినయం, నైతిక నాయకత్వంతో భారత పారిశ్రామిక రంగంలో విశేష మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.

వినయం, నైతిక నాయకత్వానికి ప్రతీక.. రతన్‌ టాటా: సీఎం చంద్రబాబు
Ratan Tata

అమరావతి, అక్టోబర్ 9: ప్రముఖ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా సేవలను దేశం ఎప్పటికీ మరువలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రతన్‌ టాటా వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ, వినయం, నైతిక నాయకత్వంతో భారత పారిశ్రామిక రంగంలో రతన్‌ టాటా విశేష మార్పులకు కృషి చేశారని కొనియాడారు. వ్యాపార రంగంలో విజయాలు సాధించడమే కాకుండా.. తన సేవల ద్వారా లక్షలాది మంది జీవితాలపై ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల దయ, ప్రజల పట్ల కరుణ, జంతువుల పట్ల ప్రేమను చూపించడం రతన్‌ టాటా వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణాలని తెలిపారు. రతన్‌ టాటా అందించిన సేవలు.. ఆయన అనుసరించిన విలువలు దేశ పారిశ్రామిక ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.


రతన్‌ టాటా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతలో నూతన ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. యువత తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చుకునేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించడం, అట్టడుగు స్థాయి నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రతన్‌ టాటా చూపిన మార్గంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్

దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులు.. 40శాతం అదనపు ఛార్జీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 01:22 PM