అప్పుడు సైబరాబాద్.. ఇప్పుడు అమరావతి.. చంద్రబాబు శ్రమకు వెలకట్టగలమా?
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:47 PM
నేడు 'ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవం'. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమైన అద్భుతాలకు తగిన గుర్తింపు ఇస్తున్న సమయమన్నమాట. నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కోవలో ముందుంటారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 20: ఇవాళ 'ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవం(World Creativity and Innovation Day)'. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ విశ్లేషణ అన్ని వర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు చేసిన క్రియేటర్లకు.. వారు సృష్టించిన కంటెంట్‌కు తగిన పారితోషికం అందేలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే 'బార్గైనింగ్ కోడ్స్'ను అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఇలాంటి రక్షణ చట్టాల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్ శిక్షణ కోసం వాడే డేటాకు సంబంధించి క్రియేటర్లకు రాయల్టీలు చెల్లించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఈ అంశాన్ని ప్రస్తుత రాజకీయ, అభివృద్ధి కోణంలో భానుప్రకాశ్ కోగంటి వివరించారు. సైబరాబాద్ నగరాన్ని నిర్మించిన దార్శనికునికి కూడా తగిన గుర్తింపు, గౌరవం దక్కాలని కోరారు. విమర్శకులు కూడా సైబరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడి పాత్రను ఎన్నోమార్లు కొనియాడారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో 'సన్‌రైజ్ అమరావతి'ని ముందుకు తీసుకొస్తున్న తీరును ప్రస్తుతించారు. చంద్రబాబు సృజనాత్మకత, ఆవిష్కరణలకు సరైన గుర్తింపు దక్కాలన్నారు.
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు..
నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక గొప్ప విజనరీ కలిగిన వ్యక్తిగా, సృజనాత్మక ఆలోచనలతో వ్యవస్థలను నిర్మించిన చంద్రబాబు నాయుడు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు భానుప్రకాశ్. సైబరాబాద్, అమరావతి సృష్టికర్తకు గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని చదవండి: