జగన్ హిందూ వ్యతిరేకి.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:04 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్ తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్ తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై గౌరవంలేని వ్యక్తికి ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న వైసీపీకి.. కూటమిని విమర్శించే అర్హత లేదు. శాసనమండలిలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలంతా గమనించారు. మండలిలోకి భగవంతుడి ఫొటోను తీసుకొచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని మహాపరాధనకు పాల్పడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్లో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి వేంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారు. చేసిన తప్పు కళ్ల ముందు కనపడుతున్నా, అన్ని ఛానళ్లలో టెలికాస్ట్ అవుతున్నా.. ఏ తప్పూ చేయలేదంటూ వారు బుకాయిస్తున్నారు’ అని అన్నారు.
‘జగన్ అండ్ కో వ్యవహారం దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా వైసీపీ వ్యవహార శైలిని గమనిస్తున్నారు. వైసీపీ తీరును అన్ని మతాలు, వర్గాలు వారు తప్పుపడుతున్నారు. వైసీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారా? ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్తు వైవీ.సుబ్బారెడ్డే ఒప్పుకున్నారు. జంతు కొవ్వే కాదు, రసాయనాలూ కలిశాయని నివేదికలో తేలింది. జగన్‌మోహన్ రెడ్డికి దేవుడంటే భక్తి లేదు. ఏ రోజు హిందూ సంప్రదాయాలను పాటించిన పాపాన పోలేదు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు కూడా ఆయన ఏనాడూ సతీమణితో కలిసి వెళ్లింది లేదు. తిరుమలలో అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌పైనా జగన్‌మోహన్ రెడ్డి సంతకం చేయలేదు. అనుభవం ఉన్న మాజీ మంత్రి బొత్స కూడా జగన్‌మోహన్ రెడ్డికి చెప్పాల్సిందిపోయి బుకాయిస్తున్న పరిస్థితి తలెత్తింది. నీ అహంకారం తగ్గించేందుకే 151లో 5 పీకేసి.. ఆ భగవంతుడు 11 సీట్లకు పరిమితం చేశాడు. గతంలో టీటీడీ నిధులను కూడా దారి మళ్లించారు. కరుణాకర్ రెడ్డి గురించి పూర్తిగా తెలిసినప్పటికీ ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి, అసెంబ్లీకి రా.. బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నాం’ అని జనార్ధన్ రెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి:
పోలీసుల బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్ట