Share News

జగన్‌పై బడ్డుకొండ ఫైర్‌.. వైసీపీకి రాజీనామా

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:39 AM

పదవుల కోసం తల్లిని, చెల్లిని పక్కనపెట్టి మీలాగ మేము ఏనాడూ రాజకీయాలు చేయలేదు. పార్టీల కోసం బంధుత్వాలు, రక్తసంబంధాలు వదులుకుని దిగజారుడు రాజకీయాలు చేయలేము.

జగన్‌పై బడ్డుకొండ ఫైర్‌.. వైసీపీకి రాజీనామా

  • పదవుల కోసం తల్లిని, చెల్లిని పక్కన పెట్టారు

  • బంధుత్వాలు, రక్తసంబంధాలు వదులుకున్నారు

  • చిన్న శీను బంధువునని నన్ను సస్పెండ్‌ చేశారు

  • మరి నాకన్నా దగ్గరోడైన బొత్సను ఎందుకు చేయలేదు?

  • తప్పని తెలిసినా పార్టీ కోసం డీఎస్సీపై నిరసనలకు రైతులను, కార్యకర్తలను తీసుకెళ్లాం

  • సింహం సింగిల్‌గా వస్తుందంటూ డైలాగులు కొట్టారు

  • చెప్పినట్లే సింగిల్‌ అయ్యి రోడ్డున పడ్డాం

  • జగన్‌పై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ

  • వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

విజయనగరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ‘పదవుల కోసం తల్లిని, చెల్లిని పక్కనపెట్టి మీలాగ మేము ఏనాడూ రాజకీయాలు చేయలేదు. పార్టీల కోసం బంధుత్వాలు, రక్తసంబంధాలు వదులుకుని దిగజారుడు రాజకీయాలు చేయలేము. రాజకీయాలు కంటే మాకు బంధుత్వమే ముఖ్యం’ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జగన్‌పై విరుచుకుపడ్డారు. ‘నేను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. నా బంధువు మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారినా నేను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన రాత్రే నన్ను నెల్లమర్ల ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించారు. తదుపరి ఇంటికే పరిమితమైన నన్ను అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సంజాయిషీ కోరలేదు. అసలు వైసీపీకి క్రమశిక్షణ కమిటీ ఉందా? ఉంటే నన్ను ఆ కమిటీకి తన ముందుకు పిలిచిందా? లేదే..!


నాకు, చిన్న శ్రీను బంధువైతే, నా కన్నా బొత్స సత్యనారాయణకు దగ్గర బంధువు కాదా? మరి ఆయన్ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదు? మీరు వైసీపీ అధ్యక్షులు కాగా.. మీ సోదరి షర్మిల పీసీసీ అధ్యక్షురాలు కాదా? మీకో నీతి, నాకో నీతినా? ఏమిటీ ద్వంద్వ వైఖరి?’ అంటూ బడ్డుకొండ, జగన్‌పై మండిపడ్డారు. ‘గత ఎన్నికల్లో జగన్‌ తప్పుల వల్లే పార్టీ, మేము ఓడిపోయాం. సింహం సింగిల్‌గా వస్తుందంటూ సినిమా డైలాగ్‌లు చెప్పారు. చెప్పినట్లే సింగిల్‌ అయి మేము రోడ్డున పడ్డాం. డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసనలు చెయ్యమంటే తప్పు అని తెలిసికూడా పార్టీ కోసం... రైతులను, కార్యకర్తలను తీసుకెళ్లాం. మీ వద్ద ఉండే చెంచాగాళ్ల మాటలు విన్నారు. ప్రజలకు, నాయకులకు మధ్య ఏదోచేస్తారని వలంటీర్లను తీసుకొచ్చారు. మాకు, ప్రజలకు మధ్య కు.ని.ఆపరేషన్‌ చేశారు. దీంతో 151నుంచి 11 స్థానాలకు పార్టీ గ్రాఫ్‌ పడిపోయింది. మీ హయాంలో తిరుమలలో మరో మతానికి చెందిన రెడ్లను పాలకులుగా నియమించారు. కుటుంబ సభ్యులతో తిరుమల దర్శనానికి వెళ్దామంటే వారు సహకరించేవారు కాదు’ అని బడ్డుకొండ ఆరోపించారు. త్వరలోనే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, నాలుగు మండలాల్లోని పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు రాజీనామా పత్రాలను ప్రదర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 03:40 AM