Share News

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 08:21 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్‌’ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. అనంతరం తుఫాన్ సన్నద్ధతపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

అమరావతి, అక్టోబర్ 27: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్‌’ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. అనంతరం తుఫాన్ సన్నద్ధతపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర రూపం దాల్చిందని, దీంతో తీర ప్రాంత ప్రభావిత జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ‘రేపు ఉదయం (సుమారు 8 నుంచి 9 గంటల మధ్య) కోనసీమ - కాకినాడ - యానం మధ్య ‘ఆర్నబ్‌’ తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటకు 140 నుంచి 160 కి.మీ, గరిష్ఠంగా 180 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి. కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదమూ ఉంది. ప్రస్తుతం సముద్రంలో 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు పడిపోయి ప్రమాదాలు జరగొచ్చు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాను పూర్తి స్థాయిలో తీరం దాటి వర్షాలు తగ్గే వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలను సీఎం చంద్రబాబు వివరించారు. ‘ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తుఫాన్ సన్నద్ధతపై సమీక్ష చేస్తూనే ఉన్నాను. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా మేం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆర్నబ్ తుఫాను రెడ్ కేటగిరీలో ఉంది. అయినా ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకూ తుఫాన్ ప్రభావం ఉంటుంది. తుఫాన్ ప్రభావంతో ఈ ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ, రేపు కూడా వర్షపాతం తీరప్రాంతాల్లో నమోదు అవుతుంది. కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలూ ఉన్నాయి. శ్రీకాకుళంలో 30 సెంటీ మీటర్లు, పశ్చిమ గోదావరిలో 28, విశాఖ 23 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల 10 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అవుతుంది. తీరప్రాంత ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. సముద్ర తీర గ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. తుఫాన్ ప్రభావంతో ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. 290 షెల్టర్లను ఏర్పాటు చేశాం. 84,396 మందిని షెల్టర్లకు తరలించాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయి. ప్రతి గంటకూ తుఫాన్ హెచ్చరికల బులెటిన్ జారీ చేస్తున్నాం. నిరంతరం తుఫాన్‌పై సమీక్షిస్తున్నాం’ అని సీఎం వెల్లడించారు


‘తుఫాన్ నేపథ్యంలో వైద్య చికిత్సల కోసం 1,316 అంబులెన్సులు సిద్ధం చేశాం. 5 వేల మంది గర్భిణులను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, సమీప ఆస్పత్రులకు తరలించాం. సురక్షితమైన తాగునీరు అందించేలా ట్యాంకర్లు, జనరేటర్లను సిద్ధం చేశాం. విద్యుత్ అంతరాయం వస్తే తక్షణం స్పందించేందుకు 8,400 మంది సిబ్బందిని నియమించాం.. తుఫాను ప్రభావంతో 15 వేల వరకూ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కురిసే భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే అవకాశం ఉంది. అలాగే వివిధ జిల్లాల్లో వాగులు వంకల్లో వరద నీటి ప్రవాహాలను అంచనా వేయటంతో పాటు చెరువులకు గండ్లు పడినా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాం. ముంపు గ్రామాల్లో ఆహారం, ఔషధాలు సరఫరా చేసేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నాం. ఆర్నబ్ కారణంగా 7.16 లక్షల హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు, 16 లక్షల ఉద్యాన పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు అంగన్‌వాడీల నుంచి పిల్లలకు, బాలింతలకు, రేషన్ పంపించేలా కూడా ఏర్పాట్లు చేశాం. క్యాచ్ మెంట్ ఏరియాలో పడే వర్షపు నీటిని రిజర్వాయర్లలో నింపేలా కూడా చర్యలు తీసుకున్నాం. తుఫాను కారణంగా నష్ట ప్రభావాన్ని సాంకేతికత ఆధారంగా అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ప్రాణ, ఆస్తినష్టం వీలైనంత మేర తగ్గించటమే లక్ష్యంగా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు మరింత సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తీవ్ర తుఫానుపై ఇవాళ రాత్రి కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, కోస్టుగార్డులను కూడా అప్రమత్తం చేశాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

తీరానికి దగ్గర్లో అర్నబ్.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. పలు విమానాలు, రైళ్ల ర

Updated Date - Oct 27 , 2026 | 08:28 PM