తీరానికి దగ్గర్లో అర్నబ్.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్
ABN , Publish Date - Oct 27 , 2026 | 07:39 PM
అర్నబ్ తుఫాను తీరానికి దగ్గర్లో ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అర్నబ్ తుఫాను తీరానికి దగ్గర్లో ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ 12 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది.
కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 100-140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు తమకు దగ్గర్లోని పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్లాలని సూచించారు. తమ ప్రాంతంలోని తుఫాను సమస్యలకు ప్రజలు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని చెప్పారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లను సంప్రదించాలని సూచించారు.
అర్నబ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో నేడు ఆయన రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేటి సాయంత్రంలోపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం తాగునీరు, వైద్యు సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఏకగ్రీవాలు!
స్థానిక ఎన్నికలు.. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ