మానవీయ కోణం మరిచారా!?
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:52 AM
కలెక్టర్ల బాధ్యత ఏమిటి? రిపోర్టులు, సమీక్షలు, గణాంకాలతో కుస్తీ పట్టడమేనా? పథకాల ప్రగతి నివేదికల తయారీలో తలమునకలు కావడమేనా? క్షేత్రస్థాయిలో పనితీరు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ... ‘కలెక్టర్ల సదస్సు’లో ప్రభుత్వాన్ని సంతృప్తి పరిచే నివేదిక సమర్పిస్తే సరిపోతుందా? ‘ప్రజల అధికారి’గా పేరుపొందిన ఎస్‌ఆర్ శంకరన్ స్థాయిలో కాకపోయినా... కనీస మానవీయ కోణం ప్రదర్శిస్తున్న కలెక్టర్లు ఎందరు?
ప్రజలతో మమేకమయ్యే కలెక్టర్లు ఎందరు?
కార్యాలయాల్లో కాగితాలతో కుస్తీ
సమీక్షలు, కాన్ఫరెన్సులతోనే బిజీ
ఆఫీసు దాటరు... ప్రజలను కలవరు
ప్రభుత్వానికి అందమైన నివేదికలు ఇస్తే సరి!
అవినీతి, అనుచిత శైలితో వివాదాస్పద ముద్ర
ప్రభుత్వానికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసేదెలా?
కలెక్టర్ల నివేదికలే పనితీరుకు ప్రామాణికమా?
నేటి నుంచే కలెక్టర్ల సదస్సు
ఎల్‌నినో, రెవెన్యూ సమస్యలపై ప్రజంటేషన్లు
గత కాన్ఫరెన్స్ నిర్ణయాల అమలుపై దృష్టి
రెండు రోజులూ సచివాలయంలోనే కలెక్టర్లు
కలెక్టర్ల బాధ్యత ఏమిటి? రిపోర్టులు, సమీక్షలు, గణాంకాలతో కుస్తీ పట్టడమేనా? పథకాల ప్రగతి నివేదికల తయారీలో తలమునకలు కావడమేనా? క్షేత్రస్థాయిలో పనితీరు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ... ‘కలెక్టర్ల సదస్సు’లో ప్రభుత్వాన్ని సంతృప్తి పరిచే నివేదిక సమర్పిస్తే సరిపోతుందా? ‘ప్రజల అధికారి’గా పేరుపొందిన ఎస్‌ఆర్ శంకరన్ స్థాయిలో కాకపోయినా... కనీస మానవీయ కోణం ప్రదర్శిస్తున్న కలెక్టర్లు ఎందరు? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు! దీనికి ఒక్కటే సమాధానం... కలెక్టర్లలో అత్యధికుల పనితీరులో మానవీయ కోణం మిస్ అవుతోంది. కార్యాలయానికే పరిమితమైపోయి... కాగితాల్లో మాత్రమే కనిపిస్తోంది! ఇదీ సీనియర్ బ్యూరోక్రాట్ల అభిప్రాయం.
ప్రజలకు, ప్రభుత్వానికీ మధ్య వారధి... జిల్లా కలెక్టర్! కలెక్టర్ల సదస్సు పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి రెండుమూడు నెలలకోసారి కలెక్టర్లను పిలిపిస్తున్నారు. కానీ... ప్రజలు మాత్రం కలెక్టర్లను కలవలేకపోతున్నారు. కలెక్టర్లూ కార్యాలయం వదిలి ప్రజల్లోకి వెళ్లడంలేదు. దీంతో క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రభుత్వం దాకా చేరుతున్నాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం రకరకాల పథకాలు, ప్రొగెస్ రిపోర్టులపై సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్‌లు ఇస్తోంది. ఇవే కలెక్టర్ల పనితీరుకు, జిల్లాల అభివృద్ధికి కొలమానం అన్నట్లుగా చెబుతోంది. రిపోర్టు బాగుంటే చాలు! కలెక్టర్ల పనితీరు అద్భుతంగా ఉందంటూ సంతృప్తిపడుతోంది. కానీ... కలెక్టర్‌లు ప్రజలను కలవడం మానేశారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్ల ర్యాంకు ఏమిటో తేల్చకుండా వారి పాలనా దక్షతను ఎలా గుర్తిస్తారన్నది అసలు ప్రశ్న. మరోవైపు కొందరు కలెక్టర్లు అవినీతి ఆరోపణలు, దురుసు ప్రవర్తన, ఉద్యోగులను వేధించడం, ఇంకా అనేకానేక విషయాల్లో అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నారు.
యాంత్రికంగా విధులు...
ఇప్పుడు జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వం అడిగిన రిపోర్టులు పంపించడం, ఆన్‌లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించడం! దీంతోనే పుణ్యకాలం గడి చిపోతోంది. సామాన్య ప్రజలను కలిసే తీరిక, ఓపిక, సమయం చిక్కడంలేదు. పైస్థాయిలో సిఫారసు ఉంటే తప్ప జిల్లా కలెక్టర్‌ను కలవలేని పరిస్థితి. కలెక్టర్లు, వారి కింద పనిచేసే సీనియర్, జూనియర్ అధికారులు ప్రజల వద్దకు వెళ్లడం లేదు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం లేదు. దీంతో సహజంగానే జిల్లా పాలనా వ్యవస్థ ప్రజలకు దూరమవుతోంది. దాని ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతోంది. దీని వల్ల ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థల (పీజీఆర్‌ఎస్) వంటివి ఎన్ని తీసుకొచ్చినా ఫలితం లభించడంలేదు. కొందరు కలెక్టర్లు చేయాల్సిన పని సక్రమంగా చేయకపోగా... వివాదాస్పదులుగా ముద్ర వేసుకుంటున్నారు. వీళ్లవల్ల ప్రభుత్వానికీ చెడ్డపేరు వస్తోందనే వాదన వినిపిస్తోంది.
ప్రజా సంతృప్తే కొలమానం
సంక్షేమ పథకాలు, వాటి అమలులో పురోగతికి సంబంధించిన రిపోర్టులపై ప్రభుత్వం చర్చించాల్సిందే. ఏ జిల్లాలో ఏ స్కీమ్ ఎలా అమలవుతోందో తెలుసుకోవడానికి సమీక్షలు అవసరం. అయితే... అంతకంటే ముందు జిల్లా స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో కూడిన చర్చలు ఉండాలి. ప్రజా స్పందన తెలుసుకోవాలి. ఇది జరగాలంటే కలెక్టర్లు, అధికారయంత్రాంగం ప్రజల వద్దకు వెళ్లి వారితో మాట్లాడాలి. పథకాల అమలు తీరుతెన్నులు, సమస్యల పరిష్కారంపై స్వీయ పరిశీలన చేయాలి. ఇదంతా వదిలేసి ఆఫీసుల్లో తయారు చేసిన నివేదికలపైనే సమీక్షలు చేసి, అద్భుతమంటూ ప్రశంసించుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజా స్పందనను ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడే పథకాల అమలులో లోటుపాట్లు తెలుస్తాయి. అప్పుడు... ప్రజలకోసం ప్రభుత్వం ఇంకేం చేయాలో స్పష్టత వస్తుంది. లేకుంటే... ఫలితాలన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. అనేక అంశాలపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల స్పందన తెలుసుకుంటోంది. అలాగే... కలెక్టర్ల పనితీరుపైనా ప్రజలు, ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి. అప్పుడే ఏ జిల్లాలో పాలన ఎలాఉందో తెలుస్తుంది. అది చేయకుండా, కేవలం రెండు మూడు నెలలకోసారి సమీక్షలు, సమావేశాలు నిర్వహించి... కలెక్టర్ ఇచ్చిన నివేదికలే వారి పనితీరుకు కొలమానం అనుకోవడం సరికాదని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
శంకరన్ దారిలో నడుస్తున్నవారెందరు?
ఒకప్పుడు కలెక్టర్ అంటే... జిల్లాకు కింగ్ అనే భావన ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లాకు అధిపతిగా ఉండేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎందరున్నా... కలెక్టర్ పోస్టుకు ఉండే గౌరవం, మర్యాద ఉన్నతస్థాయిలో ఉండేది. ఇందుకు కారణం... తమకున్న అధికారాలను ఉపయోగించి మానవీయకోణంలో ప్రజల సమస్యలను పరిష్కరించడమే. అలా ప్రజల మనిషిగా పేరొందిన వారిలో ఎస్.ఆర్.శంకరన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రభుత్వ సేవ అంటే ప్రజల సేవే అని నిరూపించిన గొప్ప వ్యక్తి ఆయన. కర్నూలు సబ్‌కలెక్టర్‌గా, నెల్లూరు కలెక్టర్‌గా పనిచేసిన శంకరన్ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపేవారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం సమయం కేటాయించి వారి బాధలు, సమస్యలు విని పరిష్కరించేవారు. ఆయన సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు నేరుగా దళిత, గిరిజన వాడలకు వెళ్లి ప్రజలతో మమేకం అయ్యేవారు. అందుకే ఆయన జనం గుండెల్లో ప్రజా ఐఏఎస్‌గా నిలిచారు. ఆయన పేరిట కాలనీలు, నగర్‌లు వెలిశాయి. రిటైర్‌మెంట్ తర్వాత వచ్చిన పెన్షన్ కూడా అట్టడుగువర్గాల విద్యార్ధుల విద్య, సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన గొప్ప మానవతావాదిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు ఎంతమంది కలెక్టర్లు ఇలా ఉన్నారు?
ఇదేం పనితీరు..
కోస్తా జిల్లాల్లోని ఓ కలెక్టర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలతో అంటకాగుతూ ఇసుక దందా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. మీడియాలో వరుసగా వార్తలు వచ్చిన తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అక్రమాలు నిజమే అని తేలింది.
ఉత్తరాంధ్రలో ఓ కలెక్టర్ సాధారణ ప్రజలకు సమయం ఇవ్వరు. కలెక్టర్‌ను కలిసేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సిందే. చివరికి, ‘కలెక్టర్ బిజీగా ఉన్నారు. మరోరోజు రండి’ అని పీఏ చెబుతారు. ప్రజలనే కాదు... మీటింగ్, ఫైల్‌పై డిస్కషన్ అని అధికారులను పిలిపించి వారినీ గంటలకొద్దీ ఆఫీసు బయటే కూర్చోబెడతారు.
ఉత్తరాంధ్రలో మరో కలెక్టరు జిల్లా పాలన అంతా ఇద్దరు మంత్రుల చేతుల్లో పెట్టేశారన్న విమర్శ ఉంది. ఓ కేంద్రమంత్రి, మరో రాష్ట్ర మంత్రికి సమాధానం ఇవ్వడం, ప్రభుత్వానికి రిపోర్టులు పంపడమే తన పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కూడా ఆయన కనిపించరు.
ఇటీవల భూ సమస్య పరిష్కరించాలని కోస్తా జిల్లాకు చెందిన ఒక బాధితుడు పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. ‘హైకోర్టు ఆదేశించినా సమస్యను ఎందుకు పరిష్కరించరు? ఇంకెంతకాలం ఫైల్ మీ దగ్గర పెండింగ్‌లో పెడతారు?’ అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. అంతే ఆమెకు పట్టరాని కోపం వచ్చి పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. రాయడానికి కూడా వీలుకాని భాషలో జేసీని అందరిముందూ తిట్టేశారు. ఇంగ్లిష్ సినిమాల్లో తరచుగా వాడే ఓ బూతుపదాన్ని ప్రయోగించారు. నిజానికి, ఆ ఫైలు కలెక్టర్ లాగిన్‌లోనే ఆరు నెలలుగా పెండింగ్ లో ఉంది. తన తప్పు బయటపడి, ప్రజలు ప్రశ్నించేసరికి అహందెబ్బతిని పక్కనే ఉన్న అధికారులపై విరుచుకుపడ్డారన్న మాట. మరోవైపు... అధికారులు ప్రజల వద్దకు వెళ్లవద్దని, ప్రజలే కలెక్టరేట్‌కు రావాలని ఆమె ఇటీవల కొత్త రూల్ తీసుకొచ్చారు. నిషేధ భూములపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేయకపోవడంతో అత్యధిక కోర్టుధిక్కార కేసులున్న జిల్లాగా రికార్డు సృష్టించిన జిల్లా ఇది.
ఈ కలెక్టర్‌కు పని తక్కువ, ప్రచారం ఎక్కువ అనే పేరుంది. ఆదివాసీలు, గిరిజనుల గూడేలకు వెళ్లి వారితోనే కాళ్లు కడిగించుకుంటారు. ఎక్కడికి వెళ్లినా సన్మానాలు, సత్కారాలు కామన్! అత్యంత వె నకబడ్డ ప్రాంతానికి కలెక్టర్‌గా ఉన్న ఆయన ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బదులు, తన ఎదుగుదల కోసం అధికారులు, ప్రభుత్వ విభాగాలను వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తన వాటాను ఓపెన్‌గా అడుగుతారని, ఆయనకు కావాల్సింది ఇస్తే, మాకు కావాల్సిన పని చేసిపెడతారని ఓ ఎమ్మెల్యే ఇటీవల ఫోన్‌లో చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు