Share News

నిజం గెలిచింది..

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:36 PM

2023 సెప్టెంబరు 9 అర్ధరాత్రి.. నంద్యాల నడిబొడ్డున హైడ్రామా.. అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

నిజం గెలిచింది..

జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తులతో టీడీపీ శ్రేణుల ర్యాలీ

కర్నూలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): 2023 సెప్టెంబరు 9 అర్ధరాత్రి.. నంద్యాల నడిబొడ్డున హైడ్రామా.. అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. కుట్రపూరితంగా అధినేత చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో నిర్బంధించిన చీకటి రోజులను టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకున్నారు. నిజం గెలిచింది.. అంటూ జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు. నాటి ఘటనలకు నిరసనగా బుధవారం రాత్రి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నగర అధ్యక్షుడు రవి ఆధ్వరంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గం ఇనచార్జిలు మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, ఎన.రాఘవేంద్రరెడ్డిలు, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజం గెలిచింది.. నీతి గెలిచింది.. నిజాయితీ గెలిచింది.. అంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసులో 53 రోజుల పాటు చంద్రబాబును రాజమండ్రి జైలులో నిర్బంధిస్తే ఆయన ఏమాత్రం బెదరలేదని అన్నారు. అక్రమ కేసులను కోర్టులు కొట్టివేయడంతో చంద్రబాబు కడిగిన ముత్యంలా చంద్రబాబు నిర్దోషిగా బయటపడ్డారని అన్నారు. ప్రజలు చంద్రన్న పక్షాన నిలబడి అఖండ విజయం అందించారని, అక్రమ అరెస్టుకు నిరసనగా వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశారని ఘాటుగా స్పందించారు.

Updated Date - Sep 09 , 2026 | 11:36 PM