Share News

స్థానిక పోరుకు సన్నద్ధం..!

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:35 PM

ఈఏడాది మార్చిలో నగర, పురపాలక సంఘాలు, ఏప్రిల్‌లో గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసింది.

   స్థానిక పోరుకు సన్నద్ధం..!

ఓటర్ల జాబితా తయారీలో అధికారులు

పురపాలికల్లో సామాజికవర్గాల వారీగా సర్వే

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లు జాబితా సిద్ధం చేయమని ఆదేశాలు

రాజకీయ పార్టీలోనూ జోరు

ఈఏడాది మార్చిలో నగర, పురపాలక సంఘాలు, ఏప్రిల్‌లో గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ఈ నెల 24న జడ్పీ, ఎంపీపీ పాలకవర్గం గడువు ముస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం అవుతుంది. పురపాలికల్లో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సర్వే చేపట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు ఎప్పుడు పచ్చజెండా ఊపినా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీలు సహా వివిధ రాజకీయ పార్టీలు కూడా స్థానిక సమరంపై దృష్టి కేంద్రీకరించాయి. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు నగరపాలక, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పురపాలికలతో పాటు 25 జడ్పీటీసీ, 426 ఎమ్పీటీసీ స్థానాలకు, 408 గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డుల సభ్యలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పురపాలికలు, పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 15 రోజుల్లో జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాలకు ప్రత్యేక అధికారులు రాబోతున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాబట్టేందుకు సకాలంలో ఎన్నికలు నిర్వహణకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగంలో పలు దఫాలుగా వీడియో కాన్ఫరెన్సలు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఏ.సిరి స్థానిక సమరం పక్కాగా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.

పురపాలికల్లో ఓటర్ల గుర్తింపు సర్వే

ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పురపాలికల్లో ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యింది. కోర్టు కేసు కారణంగా కర్నూలు నగరపాలక సంస్థలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఇటీవలే మొదలు పెట్టారు. ఇటీవల సవరించిన మున్సిపల్‌ చట్టాలకు అనుగుణంగా నగరపాలక సంస్థల్లో మేయర్‌, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సనను ప్రత్యేక్ష పద్దతిలో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్‌పర్సన్లను పరోక్ష పద్దతిలో ఎన్నుకునే విధానాలు ఖరారు చేసింది. వార్డుల విభజన పూర్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం ఈ నెల 6న షెడ్యూల్‌ విడుదల చేశారు. వార్డుల వారిగా ఓటర్ల గుర్తింపు సర్వే జోరుగా సాగుతుంది.

కర్నూలు నగరంలో..

కర్నూలు నగరంలో వార్డుల పునర్విభజన తరువాత ఓటర్ల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కర్నూలు కార్పొరేషనలో 4,79,811, ఆదోని మున్సిపాలిటీలో 1,76,679, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 84,939, గూడూరు నగర పంచాయతీలో 17,665 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 2026 జనవరి 1వ తేదీ ఆర్హతగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రచురణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లకు మార్క్‌ చేసిన జాబితాను 13వ తేది నాటికి తయారీ చేయాలి. 14న ముసాయిదా జాబితా ప్రచూరణ, 15-17 మధ్య అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరణ, 18న వాటి పరిశీలనకు అధికారుల నియామకం, 19-20న అభ్యంతరాలు, ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన, పరిష్కారం, 21న కేటగిరీల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రచూరణ చేయాల్సి ఉంది. ఆ దిశగా సర్వే జరుగుతుంది.

స్థానిక పోరుపై దృష్టి

వైసీపీ ప్రభుత్వం 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. నాడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ పాలక పెద్దలు, ప్రజా ప్రతినిధులు దౌర్జన్యాలకు దిగారు. నాడు స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. ఉమ్మడి జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలు వైసీపీ స్వంతం చేసుకుంది. విభజిత కర్నూలు జిల్లాలో 26 మండలాల్లో 426 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 357 ఎంపీటీసీ స్థానాలు (83.80 శాతం) ఏకపక్షంగా స్వంతం చేసుకుంది. తక్కువ స్థానాల్లో పోటీసీ చేసిన టీడీపీ 57 ఎంపీటీసీ స్థానాలు (13.38 శాతం) మాత్రమే గెలిచింది. జడ్పీ పీఠం సహా మండల పరిషత, మున్సిపల్‌ పీఠాలను వైసీపీనే చేజిక్కించుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో నిజాయితీగా ప్రజల మద్దతుతో స్థానిక అధికారం దక్కించుకోవడానికి కూటమి పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆతరువాత నియోజవర్గ ఇనచార్జిలు మారుతారంటూ వైసీపీ అధినేత జగన భయపెట్టడంతో పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ప్రధాన పార్టీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా స్థానిక పాలనలో సత్తా చాటేందుకు వ్యూహాలకు అప్పుడే పదును పెట్టారు.

Updated Date - Sep 09 , 2026 | 11:35 PM