అరసవల్లి మూలవిరాట్టును తాకని సూర్యకిరణాలు.. నిరాశతో వెనుదిరిగిన భక్తులు
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:26 AM
ఈ సారి కూడా అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకలేదు. దీంతో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ కమనీయ దృశ్యాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
శ్రీకాకుళం, అక్టోబర్ 1: భారతదేశంలోని అత్యంత పురాతనమైన ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. ప్రతి ఏటా దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో.. ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో మూల విరాట్‌ను సూర్యకిరణాలు నేరుగా తాకడం ఆనవాయితీ. ఈ సూర్యకిరణాలు గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం, ధ్వజస్తంభం మీదుగా, ఆలయ పంచ ద్వారాలను దాటుకుంటూ.. గర్భగుడిలోని స్వామి మూలవరాట్‌ను తాకుతాయి. ప్రతి ఏడాది ఈ దృశ్యాన్ని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి రావడంతో ఆలయప్రాంగణం భక్తజనసంద్రంలా మారింది. కానీ.. స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
రెండేళ్లుగా తాకని సూర్యకిరణాలు
సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్టును తాకకపోవడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్లుగా అరసవల్లి సూర్యనారామణ స్వామి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకడం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా మబ్బులు కమ్మి ఆదిత్యుడిని ఆ సూర్యకిరణాలు తాకడంలేదని అర్చకులు చెబుతున్నారు. అయితే.. రేపు సూర్యకిరణాలు ఆలయంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..
Read Latest AP News And Telangana News