ప్రమాదాలకు కళ్లెం
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:31 AM
రాష్ట్రంలో రోడ్డెక్కితే ప్రయాణం ఎప్పుడు విషాదాంతమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అతివేగం, డైవ్రర్ల అలసట, నిర్లక్ష్యం, రోడ్లపై నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు ...
రోడ్డు భద్రతకు ప్రత్యేక డైరెక్టరేట్
పోలీసు హెడ్‌క్వార్టర్స్ కేంద్రంగా డీటీఎంఆర్‌ఎస్ ఏర్పాటు
ఐజీ స్థాయి అధికారి నేతృత్వం
హోం శాఖ ఉత్తర్వులు
ప్రమాదాలకు కారణాలను గుర్తించి నివారణ చర్యలు!
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డెక్కితే ప్రయాణం ఎప్పుడు విషాదాంతమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అతివేగం, డైవ్రర్ల అలసట, నిర్లక్ష్యం, రోడ్లపై నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. మూడ్రోజుల వ్యవధిలోనే భోగాపురం, ఒంగోలు, కాకినాడ ప్రాంతాల్లో జరిగిన ఘోరప్రమాదాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం ఒక్కరోజే మూడు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డుప్రమాదాల విశ్లేషణ, ఎలక్ట్రానిక్ నిఘా, హైవే భద్రతకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని భావించిన కూటమి ప్రభుత్వం.. ‘డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ (డీటీఎంఆర్‌ఎస్)’ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విభాగానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా.. ప్రమాదాలకు కారణాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడమే ఈ వ్యవస్థకు అసలు సవాల్.
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడం, ప్రమాద కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించడం, బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి, హైవేలపై ఎలక్ట్రానిక్ నిఘా ఈ విభాగం ప్రధాన బాధ్యతలు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ, హైవే పెట్రోలింగ్‌కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కొత్త పోస్టులు సృష్టించడం లేదు. ఐజీ నేతృత్వంలో గరిష్ఠంగా 75 మంది సిబ్బందితో పనిచేయనుంది. ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థ నుంచే క్షేత్రస్థాయిలో నియామకాలు చేపట్టనున్నారు.
ఈ ఏడాదిలో ఎన్నో ఘోర ప్రమాదాలు..
జనవరి 22న నంద్యాల జిల్లాలో టైరు పేలడంతో ప్రైవేటు కంటైనర్.. లారీని ఢీకొని మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందారు.
జూన్ 22న కడప జిల్లాలో పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు.
చిలకలూరిపేటలో ఆగస్టు 27న పైవ్రేటు బస్సు ఆటో ఢీకొని ఏడుగురు మృతిచెందారు.
గతనెల 12న విజయవాడ వెస్ట్ బైపాస్‌పై నున్న సమీపంలో విద్యుత్ కారుకు మంటలు అంటుకోవడంతో నలుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నెల 21న ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో నూతనదంపతుల తల్లిదండ్రులు, కారు డ్రెవర్ సహా నలుగురు మృతి చెందారు. అదే రోజు కాకినాడ జిల్లాలో హైవేపై బైకర్‌ను తప్పించబోయిన ఎస్‌యూవీ.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘనలో ఇద్దరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి