Share News

ఏపీ రాజకీయ చరిత్రలో.. 9 సెప్టెంబరు 2023 గుర్తుండిపోయే రోజు: మంత్రి నాదెండ్ల మనోహర్

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:45 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 9 సెప్టెంబరు 2023 గుర్తుండిపోయే రోజని మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొన్నారు. నేటికి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లు గడిచాయంటూ.. ఆనాటి విషాద సంఘటనను గుర్తుచేసుకున్నారు.

ఏపీ రాజకీయ చరిత్రలో.. 9 సెప్టెంబరు 2023 గుర్తుండిపోయే రోజు: మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి, సెప్టెంబర్ 9: వైసీపీ ప్రభుత్వం అధికారంతో కళ్లుమూసుకునిపోయి చంద్రబాబును ఆనాడు అక్రమంగా అరెస్ట్ చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆనాడు చంద్రబాబుకు తమ అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలపకుండా.. వైసీపీ ఆయనను అన్ని రకాలుగా అడ్డుకుందన్నారు. పవన్ ఏపీకి రాకుండా ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసిందని, రోడ్డు మార్గంలో కూడా రాకుండా సూర్యాపేట నుంచే ఆటంకాలు కలిగించిందని దుయ్యబట్టారు. ఆ రోజు వీర మహిళలు, జనసైనికులు స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చి పవన్ కల్యాణ్‌కు అండగా నిలిచారన్నారు.


ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వ పతనం.. సెప్టెంబరు9 నుంచే ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైందన్నారు. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్ ఓటమి ఖాయమని మనోహర్ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆ విషయం జగన్‌కు కూడా తెలుసన్నారు. వైసీపీకి అభ్యర్థులు కూడా లేరని అందుకే ఏకగ్రీవాలపై జగన్ బెదిరింపు తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని వంద శాతం ఎన్నికల్లో విజయం సాధిస్తామని మనోహర్ విశ్వాసం వ్యక్తం చేశారు.


వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు: బుద్దా వెంకన్న

విజయవాడ: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌కు నేటికి మూడేళ్లు పూర్తయిందన్నారు. బాబు అరెస్టును ఖండిస్తూ ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగన్ వ్యవహరించారని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇచ్చిందని వెంకన్న విమర్శించారు. కష్టకాలంలో పవన్ కల్యాణ్ ధైర్యంగా ముందుకు వచ్చి బాబుకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన కూటమిగా ముందుకెళ్లి వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేశాయన్నారు. కూటమి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు కళ్లారా చూస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


జగన్ క్షమాపణలు చెప్పాలి: మైలవరం ఎమ్మెల్యే వసంత్

ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి మూడేళ్లు గడిచాయన్నారు. ఆ రోజే జగన్ అనే భాస్మాసురుడి పతనం ఆరంభమయిందన్నారు. ప్రజానాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో జగన్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారని వసంత్ అన్నారు. చంద్రబాబు గెలవడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని వసంత్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలో రూ.9.5 కోట్లతో అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. 15 రోజుల క్రితం చింతలపూడి ప్రాజెక్టు పనులకు రూ.500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 2028 ఆఖరుకు చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.


శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ

మూడేళ్ల క్రితం అర్ధరాత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు తెలుగు ప్రజలకు చీకటి రోజని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఎలాంటి తప్పు చేయని విజనరీ నేతపై రాజకీయ కక్షతోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు ‘నిజం గెలవాలి’ పేరిట నియోజకవర్గాల్లో పర్యటించారని, లోకేశ్ ఢిల్లీలో నిరసన వినిపించారని ఆమె అన్నారు. కుటుంబసభ్యులే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలందరూ ఆయనకు అండగా ఉన్నారని అనురాధ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎండైనా వానైనా.. హైదరాబాద్‌ హైరానా

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 12:48 PM