‘సైబర్ గార్డ్స్’ వస్తున్నారు
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:41 AM
రాష్ట్రంలో డ్రగ్స్ కన్నా సైబర్ నేరాలే తీవ్రంగా ఉన్నాయని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ‘సైబర్ గార్డ్స్’ విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. మంగళగిరిలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాలో ఒక సైబర్ టీమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మంగళగిరిలో ప్రత్యేక వార్‌రూమ్.. ప్రతి జిల్లాకొక సైబర్ టీమ్
బాధితులు 1930కు కాల్ చేయండి
తొలి అరగంటే కీలకం: డీజీపీ హరీశ్‌గుప్తా
బెజవాడలో సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం ప్రారంభం
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్ కన్నా సైబర్ నేరాలే తీవ్రంగా ఉన్నాయని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ‘సైబర్ గార్డ్స్’ విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. మంగళగిరిలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాలో ఒక సైబర్ టీమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్’(సీ-4)తో పాటు సైబర్ రాడార్ విభాగం, సైబర్ ప్రయోగశాలను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు సమాజానికి ముప్పుగా, పోలీసు శాఖకు సవాలుగా పరిణమించాయని అన్నారు. సైబర్ మోసాల్ని అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పోలీసులు, బ్యాంకర్లు, సైబర్ నిపుణులు, న్యాయ సిబ్బందితో కలిపి మంగళగిరిలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకుని పోలీసు శాఖలో ప్రవేశించబోతున్న కానిస్టేబుళ్లలో సుమారు 800 మంది బీటెక్, ఎమ్మెస్సీ పట్టభద్రులు ఉన్నారని, వారికి ఎప్పటికప్పుడు సైబర్ డిటెక్షన్‌పై శిక్షణ ఇస్తామని అన్నారు.
టెక్ పోలీసుల్లో జిల్లాకు 20 మంది చొప్పున కేటాయించి, ప్రతి జిల్లాలో సైబర్ బృందాన్ని సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆయా జిల్లాల్లో ఏ స్టేషన్ పరిధిలో కేసు నమోదైనా ఈ బృందం రంగంలోకి దిగి చర్యలు చేపడుతుందని తెలిపారు. సైబర్ మోసానికి గురైన బాధితులు తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. డబ్బులు రికవరీ చేయాలంటే మొదటి 30 నిమిషాలే కీలకమని అన్నారు. ఫిర్యాదు తొందరగా అందితే బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని డబ్బు సీజ్ చేయిస్తామని చెప్పారు. ఆలస్యమైతే సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును మ్యూల్ ఖాతాలకు మళ్లించేస్తారని, రికవరీ చేయడం కష్టమవుతుందని తెలిపారు. దేశంలో సైబర్ నేరాల సొమ్ము రికవరీ 2 శాతం ఉండగా ఏపీలో 5 శాతం ఉందని వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, డిజిటల్ అరెస్టుల్లాంటి వాటి బారినపడటం బాగా తగ్గిపోయిందని అన్నారు. అయితే పెట్టుబడి మోసాలు బాగా పెరిగాయని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో 60 వేల వరకూ సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు.
ప్రతి పీఎస్‌లో సైబర్ ఎస్‌ఐ: సీపీ రాజశేఖర్ బాబు
ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ప్రత్యేకంగా సైబర్ ఎస్‌ఐని నియమించినట్లు విజయవాడ సీపీ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. సైబర్ సిబ్బందికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు తీరుతెన్నులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి 195 మంది సైబర్ గార్డ్స్‌ను రంగంలోకి దించామని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘ఖాకీ బాబు’, ‘సైబర్ చిట్టి’, పాత్రలతో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రచార రథాలు, డ్రోన్ల ద్వారా ఆడియో సందేశాలు వినిపిస్తూ ‘అవగాహనే సైబర్ నేరాలపై తొలి రక్షణ కవచం’ అనే లక్ష్యంతో ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ చేతుల మీదుగా ప్రారంభమైన సీ-4 బాధితుడి ఫిర్యాదు నుంచి నేరస్తుడి ఆనవాళ్ల వరకూ ప్రతి సమాచారాన్ని విశ్లేషిస్తుందని చెప్పారు. టెక్నాలజీ, ట్రైనింగ్, సమన్వయంతో సైబర్ నేరాలపై మరింత సమర్థంగా పోరాడేందుకు ఈ కేంద్రం కీలకంగా మారనుందని తెలిపారు.
మా సీఐకి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు సర్.. నాకూ మెసేజ్ పంపారు
విజయవాడ సీపీ.. డీజీపీ మధ్య ఆసక్తికర సంభాషణ
కృష్ణలంక పోలీస్ స్టేషన్ మూడో అంతస్తులో సీ-4 ప్రారంభం సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సైబర్ మోసగాళ్ల ఎత్తుగడల గురించి సీపీ ప్రస్తావిస్తూ.. ‘ఈ మధ్య సైబర్ నేరగాళ్లు మా సీఐకే ఫోన్ చేసి యాభై వేలు డబ్బులు అడిగారు సర్. ఓ వ్యక్తి తాను రాయదుర్గం ఎస్‌ఐ అని చెప్పాడు. ఒక దొంగను బంగారు రికవరీ కోసం తీసుకొచ్చామని అన్నాడు. కొంత నగదు తక్కువ పడిందని, సర్దుబాటు చేస్తే తర్వాత మీకు పంపుతాం’ అంటూ మోసం చేయబోయినట్లు వెల్లడించారు. వెంటనే సీఐకి స్థానిక బంగారు వ్యాపారి నుంచి ఫోన్ రావడంతో.. ఇద్దరికీ ఒకే నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని తెలుసుకుని సైబర్ మోసంగా గుర్తించి అప్రమత్తమైనట్లు చెప్పారు. సీపీ చెప్పింది విన్న డీజీపీ స్పందిస్తూ.. ‘నాకు కూడా ఈ మధ్య సెంట్రల్ మినిస్ట్రీ ఓఎస్‌డీ పేరుతో మెసేజ్‌లు పంపారు. నన్ను కూడా మోసం చేయబోయారు. నేను ఆ మెసేజ్‌లకు స్పందించలేదు’ అని తన అనుభవాన్ని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి