వైవాహిక వివాదాల్లో రాజీకి వీల్లేని కేసుల్నీ కొట్టేయవచ్చు
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:44 AM
ఇరుపక్షాలు రాజీకి ముందుకు వస్తే వైవాహిక వివాదాలు, వరకట్న వేధింపులు వంటి రాజీకి వీల్లేని కేసులను సైతం బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 528 కింద తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో కొట్టివేయవచ్చని హైకోర్టు పేర్కొంది.
శ్రీకాకుళం కోర్టులో ఉన్న కేసు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఇరుపక్షాలు రాజీకి ముందుకు వస్తే వైవాహిక వివాదాలు, వరకట్న వేధింపులు వంటి రాజీకి వీల్లేని కేసులను సైతం బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 528 కింద తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో కొట్టివేయవచ్చని హైకోర్టు పేర్కొంది. క్రిమినల్ స్వభావం లేని వాటిల్లో ఇలా చేయవచ్చని తెలిపింది. శ్రీకాకుళం కోర్టులో ఉన్న ఓ కేసులో ఇటీవల తీర్పునిస్తూ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త, అతని తరఫు బంధువులు చిత్రహింసలకు గురిచేయకుండా అడ్డుకోవడమే ఐపీసీ సెక్షన్ 498ఏ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేసింది. నిజమైన చిత్రహింస కేసులలో రాజీకి వీలులేకుండా చేసేందుకు ఈ సెక్షన్‌ను నాన్ కాంపౌండబుల్‌లో చేర్చారని పేర్కొంది. అయితే వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకొచ్చినప్పుడు ఆ కేసును హైకోర్టు తనకి ఉన్న ప్రత్యేక అధికారాలతో రాజీ చేయవచ్చని స్పష్టం చేసింది.
ప్రస్తుత కేసులో ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిషేధిత చట్టం సెక్షన్ 3, 4 రాజీకి వీల్లేనివి అయినప్పటికీ.. భార్య, భర్త, కుటుంబ సభ్యులు రాజీ చేసుకోవడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 528 కింద దఖలు పడిన అధికారాన్ని ఉపయోగించి శ్రీకాకుళం కోర్టులో ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. భార్యను చిత్రహింసలకు గురిచేయడం(బీఎన్‌ఎస్ సెక్షన్ 85), వరకట్న నిషేధిత చట్టం సెక్షన్ 3, 4 కింద తమపై శ్రీకాకుళం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలంటూ ఓభర్త, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోనే న్యాయమూర్తి తాజా వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!