Share News

జయహో బీసీ

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:43 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. కీలకమైన వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చింది. పట్టణ, గ్రామీణ సంస్థలన్నింటిలోనూ సగటున 28.18శాతం పదవులు బీసీలకు దక్కేలా నిర్ణయించింది.

జయహో బీసీ

అధికారికంగా సగటున 28.18శాతం

కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం

గత వైసీపీ హయాంలో 24శాతమే

దానికన్నా ప్రస్తుతం 4.18 శాతం అదనంగా కేటాయింపు

కూటమి పార్టీల తరఫున 34శాతం సీట్లు ఇస్తామని మంత్రుల ప్రకటన

ఆ ప్రకారం ఏకంగా పదిశాతం ఎక్కువగా వారికే అవకాశాలు

రెండు జిల్లాల్లో మూడు వేలకుపైగా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో పదవులు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. కీలకమైన వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చింది. పట్టణ, గ్రామీణ సంస్థలన్నింటిలోనూ సగటున 28.18శాతం పదవులు బీసీలకు దక్కేలా నిర్ణయించింది. ఆయా కేటగిరీ పదవుల వారీగా ఎంత శాతం అన్నది కూడా పేర్కొంది. శనివారం అమరావతిలోని సచివాలయం లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తూ తీర్మానం చేసింది. దీంతో గతం కన్నా పదవులు అధికంగా దక్కనున్నాయి.

మార్కాపురం/ఒంగోలు అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : తొలి నుంచి వెనుకబడిన వర్గాల విషయంలో టీడీపీ సానుకూలంగా ఉంటూ ఒకరకంగా బీసీల పార్టీగా ముద్రపడింది. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో 1987లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అప్పట్లో 20శాతం రిజర్వేషన్లు ఇవ్వగా 1995లో సీఎంగా చంద్రబాబునాయుడు వాటిని 34శాతానికి పెంచారు. తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా అలాగే కొనసాగించారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ రిజర్వే షన్లను 24శాతానికి తగ్గించింది. దీంతో బీసీలు గణనీయంగా పదవులు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి 34శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. తదనుగుణంగా 34శాతం రిజర్వేషన్ల ఉత్తర్వులు ఇవ్వగా దానిని వ్యతిరేకిస్తూ వైసీపీకి చెందిన వారు కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. దానిని సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం సవాల్‌ చేసినా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న నిబంధనతో రాష్ట్రప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, చట్టప్రకారం ఎంతశాతం కేటాయింపు అవకాశం ఉందో పరిశీలించి అధికారికంగా ఆ మేరకు రిజర్వు చేసి 34శాతం కంటే తక్కువ ఉంటే అంతమేర జనరల్‌ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పిస్తామని శుక్రవారం జిల్లాలోని నర్సింగోలులో జరిగిన బహిరంగ సభలోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై అధికారికంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించింది.

రాజీవ్‌ రంజన్‌మిశ్రా కమిషన్‌ నివేదిక ప్రకారం..

గతంలో ప్రభుత్వం నియమించిన రాజీవ్‌ రంజన్‌మిశ్రా కమిషన్‌ నివేదికను పరిగణనలోకి తీసుకొని బీసీల రిజర్వేషన్లను నిర్ధారించింది. కాగా మంత్రివర్గ నిర్ణయం ప్రకారం పంచాయతీ వార్డు సభ్యులలో 26.73శాతం, సర్పంచ్‌లలో 29.95శాతం, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో 24.60శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 25.55శాతం, జడ్పీ చైర్మన్‌ స్థానాల్లో 23.08 శాతం సీట్లు బీసీలకు దక్కనున్నాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లలో 35.29శాతం, చైర్మన్లలో 33.02శాతం, పట్టణ వార్డుల్లో 32.78శాతం లభించనున్నాయి. అలా మొత్తంగా అన్ని స్థానాలు కలిపి 28.18శాతం బీసీలకు దక్కనున్నాయి. రెండు జిల్లాల జడ్పీ చైర్మన్లు, ఒంగోలు మేయర్‌తోపాటు మిగిలిన 8 మునిసిపల్‌, నగరపంచాయతీ చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్‌ రాష్ట్రం యూనిట్‌గా జరగనుంది. మిగిలిన వాటికి జిల్లా పరిధిలోనే చేస్తారు. ఆ ప్రకారం చూస్తే ప్రకాశం జిల్లాలో 145 సర్పంచ్‌, 1,393 వార్డుసభ్యులు, ఏడు జడ్పీటీసీ, మరో 7 ఎంపీపీలు, 95 ఎంపీటీసీలు, 69 పట్టణాల్లో వార్డులు బీసీలకు దక్కనున్నాయి. మార్కాపురం జిల్లాలో 133 సర్పంచ్‌, 1,064 వార్డులు, 5 జడ్పీటీసీ, 5 ఎంపీపీ, 70 ఎంపీటీసీ, 49 పట్టణ వార్డు పదవులు బీసీలకు అధికారికంగా కేటాయింపు కానున్నాయి. కాగా 34శాతం బీసీ రిజర్వేష న్లకు కట్టుబడి ఉన్నామని కూటమి పార్టీలు ప్రకటించడంతో వివిధ పదవులు మరో ఆరేడు వందలు బీసీలకు దక్కే అవకాశం ఉంది.

రెండు జిల్లాల్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల వివరాలు

ప్రకాశం జిల్లాలో 519 గ్రామపంచాయతీలు, వాటిలో 5,213 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బీసీలకు 145 సర్పంచ్‌లు, 1,393 వార్డు సభ్యుల స్థానాలు దక్కే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లాలోని 27 మండలాలు వాటి పరిధిలో 373 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జడ్పీ చైర్మన్‌ రాష్ట్ర యూనిట్‌ కాగా జిల్లాలో బీసీలకు 7 జడ్పీటీసీ, 7 ఎంపీపీ, 95 ఎంపీటీసీ స్థానాలు దక్కనున్నాయి.

ప్రకాశంలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, కందుకూరు, చీమకుర్తి, దర్శి మునిసిపాలిటీలు ఉన్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌లో 62 డివిజన్లు ఉండగా మిగిలిన నాలుగు మునిసిపాలిటీల్లో కలిపి 148 మునిసిపల్‌ వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్‌ మేయర్‌, మునిపల్‌ చైర్మన్‌ పదవులకు రాష్ట్ర యూనిట్‌ కాగా... వార్డులకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీసీలకు ఒంగోలు కార్పొరేషన్‌లో 20 కార్పొరేటర్లు, ఇతర పట్టణాల్లో 49 మున్సిపల్‌ వార్డులు లభించనున్నాయి.

మార్కాపురం జిల్లా పరిధిలో 406 గ్రామ పంచాయతీలు, వాటిలో 3,981 వార్డులు ఉండగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీసీలకు 113 సర్పంచ్‌, 1,064 వార్డు సభ్యుల పదవులు దక్కనున్నాయి.

మార్కాపురం జిల్లాలో 21 మండలాలు, వాటి పరిధిలో 272 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జడ్పీ చైర్మన్‌ స్థానానికి రాష్ట్ర యూనిట్‌ కాగా జిల్లాలోని 21 మండలాల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీసీలకు ఐదు జడ్పీటీసీలు, ఐదు ఎంపీపీలు, అలాగే 70 ఎంపీటీసీ స్థానాలు లభించనున్నాయి.

మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి పట్టణ స్థాఽనిక సంస్థల పరిధిలో 128 వార్డులు ఉన్నాయి చైర్మన్‌ స్థానాలకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక జరగనుండగా 49 వార్డులు బీసీలకు దక్కనున్నాయి.

రెండు జిల్లాల జడ్పీ చైర్మన్‌, అలాగే ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మిగిలిన 8 పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లలో బీసీలకు ఎన్ని లభిస్తాయన్నది రాష్ట్ర యూనిట్‌గా జరిగే రిజర్వేషన్‌ ఎంపిక ప్రకారం ఉండనుంది.

టీడీపీలోనే బీసీలకు ప్రాధాన్యం

కొఠారి నాగేశ్వరరావు, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి

టీడీపీలోనే బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని మరోసారి రుజువైంది. అసలు టీడీపీ ఆవిర్భావం తర్వాతనే బీసీలకు రాజకీయ గుర్తింపు లభించింది. ఆర్థికంగా, సామాజికంగా బీసీల అభివృద్ధి టీడీపీ ద్వారానే జరిగింది. చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలని ప్రయత్నిస్తే గొడ్డలి పార్టీ కుట్ర చేసి అడ్డుకుంది. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించడమే కాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెచ్చిన 34శాతం జీవోపైనా కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. అయినా బీసీలకు ప్రాతినిథ్యం పెంచేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. తాజా నిర్ణయం ప్రకారం 28.18 శాతం పదవులు అధికారికంగా, మరో ఏడు శాతం కూటమి ద్వారా బీసీలకు అందనున్నాయి. ఈ వాస్తవాలను బీసీ ప్రజానీకం గుర్తించాలి. రానున్న ఎన్నికల్లో కూటమికి అండగా నిలవాలి.

Updated Date - Oct 11 , 2026 | 02:43 AM